Telangana Ministers Flag Hoisting on Independence Day :ఖమ్మం పోలీసు పరైడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేసి గౌరవవందన స్వీకరించారు. అనంతరం ప్రభుత్వ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి భట్టి విక్రమార్క ప్రసంగించారు. కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు జాతీయ జెండాను ఎగరవేశారు. స్వతంత్ర పోరాటంలో అసువులు బాపిన త్యాగధనుల్ని స్మరించుకున్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రంలో ప్రజా పాలన నడుస్తోందని పొన్నం వ్యాఖ్యానించారు. హనుమకొండ పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ జెండా ఆవిష్కరించిన అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రభుత్వ పాధాన్యతల్ని వివరించారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు.
'ధరణికి సంబంధించి సమీకృత భూమి రికార్డు నిర్వహణ వ్యవస్థలో భారంగా ధరణి పోర్టల్‌ను గత ప్రభుత్వం ప్రవేశపట్టింది. దీని వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను అర్థం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, ధరణి స్థానంలో అత్యుత్తమ చట్టం రూపకల్పనకు చర్యలు చేపట్టింది. నాలుగు గోడలు, నలుగురు మనుషుల మధ్య రూపకల్పన చేయకుండా ప్రజా ఆమోదం చట్టం కోసం మేధావుల సూచన మేరకు ఆగస్టు 2 నుంచి 23 వరకు వెబ్‌పోర్టల్‌లో ఉంచి సలహాలు, సూచనల ప్రకారం ఆదర్శమైన రెవెన్యూ చట్టాన్ని తీస్తాం'-భట్టి విక్రమార్క, ఉపముఖ్యమంత్రి