తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫేక్ డిగ్రీలతో ట్రీట్​మెంట్ చేస్తున్నారు! - ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండండి - FAKE DOCTORS IN NIZAMABAD

రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా నకిలీ వైద్యులు - ఇష్టారాజ్యంగా స్టెరాయిడ్స్, హైడోస్‌ ఔషధాల వినియోగం - చోద్యం చూస్తున్న ఔషధ నియంత్రణ, ఆరోగ్య శాఖలు

Fake Doctors In Telangana
Fake Doctors in Nizamabad (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 28, 2024, 1:45 PM IST

Fake Doctors in Nizamabad :గ్రామాల్లో జ్వరం, ఒళ్లునొప్పులు, ఇలా వ్యాధి ఏదైనా ముందుగా వెళ్లేది దగ్గర్లోని ఆర్‌ఎంపీ వద్దకే. ఇలా రోగాలను నయం చేస్తారనే భరోసాతో వైద్యుడి దగ్గరకు వెళ్లి వేలకు వేలు ఫీజులు చెల్లిస్తున్నారు అయితే కొన్ని సంఘటనల వల్ల చికిత్స చేస్తున్నది నిజంగా వైద్యుడా లేదా నకిలీ వైద్యుడా అనే అనుమానం వస్తుంది. తాజాగా నకిలీ డిగ్రీల(డీబీఎంఎస్‌)తో నలుగురు వైద్యులు చాలా రోజులుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతుంటే హైదరాబాద్‌ నుంచి అధికారులు వచ్చే వరకు గుర్తించపోవడం గమనార్హం.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ వైద్య మండలి నుంచి ప్రత్యేకంగా అధికారులు వచ్చి 30 క్లినిక్‌లు తనిఖీ చేసి 15 మంది నకిలీ వైద్యులు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో కొందరు యాంటీబయోటిక్స్‌ ఇంజెక్షన్లు, స్టెరాయిడ్స్, షెడ్యూల్‌ హెచ్‌ డ్రగ్స్‌ విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కనీస విద్యార్హత లేకున్నా వైద్యులుగా చేస్తూ మందుల చీటీలు రాయకుండానే ఔషధాలు అమ్మినట్లు తేలింది. వారి ఔషధ దుకాణాల్లో ఫార్మాసిస్టులు కూడా లేకపోవడంతో డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీ, ఫార్మసీ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.

ఇంతా జరుగుతున్నా జిల్లాల వైద్యారోగ్యశాఖ అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్న ప్రజల్లో వ్యక్తమవుతోంది. రూ.లక్షల్లో వేతనాలు పొంది ఏసీ గదుల్లో కూర్చుంటే ఇలాంటి వారు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తారని మండిపడుతున్నారు. నెలకు రూ.లక్షల్లో కమీషన్లు వస్తుంటే ఇలాంటి వారు పుట్టగొడుగుల్లా పుట్టుకస్తారు.

ప్రైవేటు ఆస్పత్రి పర్సంటేజీల కోసమే : గ్రామాలు, పట్టణాల్లోని ఒక ఆర్‌ఎంపీ పట్టణాల్లోని ప్రైవేట్ ఆసుపత్రికి రోగిని పంపిస్తే 20 నుంచి 30 శాతం పర్సంటేజీ ఇస్తున్నారు. కొందరు వైద్యులు పోటీపడి 40 నుంచి 50 శాతం కమీషన్‌ ఇస్తున్నారు. ఇలా గ్రామానికి ముగ్గురు, నలుగురు ఆర్‌ఎంపీలు పుట్టుకొచ్చి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు. జిల్లా కేంద్రానికి 2 కి.మీ. దూరంలో భాగ్యనగర్‌(ఖానాపూర్‌)లో 1500 మంది నివసిస్తున్నారు. ఇక్కడ 6 ఔషధ దుకాణాలు, 8 మంది ఆర్‌ఎంపీలు ఉన్నారంటే మారుమూల గ్రామాల పరిస్థితి ఎలా ఉందో చెప్పనక్కర్లేదు.

మొక్కుబడి తనిఖీలు: జిల్లా కేంద్రంలో దవాఖానాల్లో ఆరు నెలలుగా తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. నెలకు ఒకటి రెండు ఔషధ దుకాణాలు మొక్కుబడిగా తనిఖీ చేసి లంచాలకు ఆశపడి ఎవరికీ సమాచారం ఇవ్వట్లేదు. గతంలో పనిచేసిన డీఐ ముమ్మర తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఔషధ దుకాణాలపై దాడులు చేశారు. లైసెన్సులు లేకుండా విక్రయిస్తున్న చాలా వారిపై కేసులు నమోదు చేశారు.

కానీ ప్రస్తుతం ఉన్న అధికారులు తనిఖీ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరిస్తున్నారు. ఇటీవల వైద్యారోగ్యశాఖ అధికారులు జిల్లాల్లోని ఆర్‌ఎంపీ క్లినిక్‌లను, ఆసుపత్రులను తనిఖీ చేసినా నకిలీ డీబీఎంఎస్‌ డిగ్రీతో ఆసుపత్రులను నిర్వహిస్తున్న విషయం తెలియకపోవడం గమనార్హం. తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌లలో 'నకిలీ డాక్టర్లు' - వారు చెప్పే హెల్త్‌ టిప్స్‌ పాటించారో ప్రాణాలు గాల్లోనే!

హైదరాబాద్​లో స్ట్రీట్​కో శంకర్​దాదా ఎంబీబీఎస్ - ఈ ఫేక్ డాక్టర్లతో జాగ్రత్త సుమీ!! - FAKE DOCTORS IN HYDERABAD

ABOUT THE AUTHOR

...view details