Telangana Martyrs Stupa Sculptor :రాష్ట్ర అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూప రూపశిల్పి ఎక్కా యాదగిరి రావు. తొలిదశ, మలిదశ తెలంగాణ ఉద్యమానికి నిలువెత్తు సాక్షం ఆయన. తెలంగాణ ఆకాంక్ష కోసం తన ప్రాణమిత్రుడు అసువులు బాసినా గుండెనిబ్బరంతో అమరుల బలిదానాలను తెలంగాణ చరిత్ర నుదిటిపై సాక్ష్యంగా నిలిపిన వాడు.
పాలమూరు మూలాలున్న ఆ 'మట్టి మనిషి' అంచెలంచెలుగా పద్మశ్రీ వరకు ఎదిగారు. మరుగున పడ్డ చరిత్రను యాదికి తెచ్చుకుంటూ 1969 ఉద్యమ ఘటనల్ని తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఆయన తన అనుభవాలను వివరించారు. అసువులు బాసిన అమరుల జ్ఞాపకానికి చిహ్నంగా ఈ స్థూపాన్ని ఏర్పాటు చేసినట్లు యాదగిరి పేర్కొన్నారు. తాము చేసిన కృషిని, అమరుల త్యాగాలను ప్రభుత్వాలు గుర్తించకపోవడం దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
"గన్ పార్క్‌లోని అమరవీరుల స్థూపం ఉన్నందుకే ఉద్యమకారుల చరిత్ర ఉంది. తెలంగాణ ఏర్పాటుకు ఈ స్థూపమే కారణం. ఇప్పుడు అమరవీరుల స్థూపాన్ని చూస్తుంటే నాకు కన్నీళ్లు ఆగడం లేదు. తెలంగాణ ఉద్యమంలో గన్‌పార్క్ దద్దరిల్లింది. అమరులతో రాజకీయాలేంటో అర్థం కావడం లేదు. ఈ మెమోరియల్‌ను ప్రారంభించకపోవడం, దాన్ని ఏర్పాటు చేసినోళ్లను పట్టించుకోకపోవడం దారుణం."- ఎక్కా యాదగిరి రావు, అమరవీరుల స్థూపం రూపకర్త