Telangana Lok Sabha Election Counting Arrangements :రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అంతా సిద్ధమైంది. మే 13న జరిగిన ఎన్నికల్లో 17 నియోజకవర్గాల్లో 66.3శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 2 కోట్ల 20 లక్షల 24 వేల 806 ఓట్లు లెక్కించేందుకు ఏర్పాట్లు చేశారు. అందులో పోస్టల్ బ్యాలెట్లు 2,18,000 కాగా, మిగతావి ఈవీఎంలలో నమోదైనవి. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 34 ప్రాంతాల్లో 120 హాళ్లలో 1,855 టేబుళ్లు సిద్ధం చేశారు.
చేవెళ్ల, మల్కాజిగిరి పరిధిలో రెండేసి టేబుళ్లు : ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక హాలు ఏర్పాటు చేయగా, మహేశ్వరంలో రెండు హాళ్లు సిద్ధం చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం 19 హాళ్లలో 276 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతీ లోక్‌సభ నియోజకవర్గానికి ఒక టేబుల్ ఏర్పాటు చేయగా, చేవెళ్ల, మల్కాజిగిరిలో రెండేసి సిద్ధం చేశారు. ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు టేబుళ్లు, సిబ్బంది వేర్వేరుగా ఉన్నందున, లెక్కింపు సమాంతరంగా ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఓట్ల లెక్కింపు సాయంత్రం 4 వరకు పూర్తవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.
"సాధారణ ప్రక్రియ ఏమిటంటే, ఒకే హాల్లో పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం రెండూ కౌంటింగ్ ఉంటే మొదట పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కించటం జరుగుతుంది. దానికి అర్ధగంట తరవాత ఈవీఎం స్టార్ట్ అవుతుంది. కానీ మన దగ్గర సికింద్రాబాద్ ఉప ఎన్నికల కౌంట్ మినహా అన్నింటా రెండూ వేరువేరుగా కౌంటింగ్ హాల్స్ ఉన్నాయి కావున ఏక కాలంలో కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది."-వికాస్ రాజ్, సీఈఓ