IMD Officer On Telangana Weather Report :రాష్ట్రంలో సాధారణం కన్నా రెండు నుంచి నాలుగు డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మెదక్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు హైదరాబాద్ వాతావారణ కేంద్రం అధికారి రవీంద్రకుమార్ వెల్లడించారు. సోమవారం రాష్ట్రంలో అత్యధికంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లుగా ఆయన వివరించారు.
రాబోవు 3 రోజులు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం :రాబోవు మూడు రోజుల పాటు తూర్పు, ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు రవీంద్ర కుమార్ వెల్లడించారు. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ ఏడాది ఒకటి, రెండు డిగ్రీల హెచ్చుదల కనిపిస్తున్నట్లుగా వివరించారు. రాష్ట్రంలోనే మెదక్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా ఆయన తెలిపారు. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైనట్లుగా రవీంద్ర కుమార్ తెలిపారు. హైదరాబాద్లో 32 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లుగా ఆయన వెల్లడించారు.
"రాబోవు మూడు రోజుల్లో ఖమ్మం, భద్రాచలంతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ లాంటి ప్రాంతాల్లో సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో ఈ రోజు మెదక్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఒకటి నుంచి రెండు డిగ్రీల హెచ్చుదల కనిపిస్తోంది. "- రవీంద్ర కుమార్, వాతావరణ కేంద్రం అధికారి