Telangana High Court Fires On Hydra Demolitions :సంగారెడ్డి జిల్లాఅమీన్‌పూర్‌లో కూల్చివేతలపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా హైడ్రాపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వర్చువల్‌గా హాజరైన కమిషనర్ రంగనాథ్‌ను, నేరుగా హాజరైన అమీన్‌పూర్ తహసీల్దార్‌ను ఉద్దేశించి పలు అంశాలను ప్రస్తావించింది. హైడ్రా ఏర్పాటు ఎంతో ప్రశంసనీయమని, కానీ నిబంధనలు పాటించకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నామంది. ఆదివారం కూల్చివేతలు హైకోర్టు తీర్పునకు వ్యతిరేకమని తెలియద? అంటూ రంగనాథ్‌ను ఉద్దేశించి హైకోర్టు ప్రశ్నించింది. ఎమ్మార్వో విజ్ఞప్తి మేరకు చర్యలు తీసుకున్నామని రంగనాథ్ చెప్పడంతో, ఎమ్మార్వో అడిగితే గుడ్డిగా చర్యలు తీసుకుంటారా అంటూ మందలించింది.
ఎమ్మార్వో అడిగితే చార్మినార్, హైకోర్టు కూడా కూల్చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా, రంగనాథ్ పనితీరుపై తాము సంతృప్తికరంగా లేమని, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అంటే కూల్చివేతలేనా అంటూ వ్యాఖ్యానించింది. హైడ్రా కేవలం కూల్చివేతలపైనే ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోందని పేర్కొంది. కోర్టు స్టేలను కూడా పట్టించుకోకుండా కూల్చివేతలు చేపడితే, ధిక్కరణ కింద సుమోటోగా స్వీకరించాల్సి వస్తుందని మందలించింది. రాజకీయ నేతలు, పాలక వర్గాల మెప్పు కోసం నిబంధనలు ఉల్లంఘించడం తగదంటూ హితవు పలికింది.
మాదాపూర్‌లో ప్రయాణం ఎంత సమయం పడుతుందో తెలుసు కదా? : జీవో ప్రకారం హైడ్రాకు ఎన్నో విధులు ఉన్నాయని, మిగతావి పట్టించుకోకుండా కూల్చివేతలపైనే దృష్టి ఎందుకు పెడుతున్నారని నిలదీసింది. ట్రాఫిక్ సమస్యపైనా హైడ్రాకు బాధ్యత ఉందని గుర్తు చేసింది. ట్రాఫిక్ గురించి ఏమాత్రం పట్టించుకోవట్లేదని వ్యాఖ్యానించింది. మాదాపూర్‌లో ప్రయాణానికి ఎంత సమయం పడుతుందో తెలుసు కదా అంటూ గుర్తు చేసింది.
సబ్ రిజిస్ట్రార్, రిజిస్ట్రేషన్, స్థానిక సంస్థ అనుమతి ఇస్తేనే ఇళ్లు నిర్మించుకుంటున్నారని, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపంతో సామాన్యులు నష్టపోవాల్సి వస్తోందని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. అడిగిన ప్రశ్నలను దాటవేయకుండా సమాధానం ఇవ్వాలని రంగనాథ్‌కు సూచించింది. కోర్టులను ఎంతో గౌరవిస్తున్నామని, న్యాయమూర్తికి రంగనాథ్ తెలిపారు. మూసీపై కూడా 20 లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలయ్యాయని హైకోర్టు గుర్తు చేసింది. చట్ట ప్రకారం నడుచుకోకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని అమీన్‌పూర్ తహసీల్దార్‌ను హైకోర్టు హెచ్చరించింది.