తెలంగాణ

telangana

ETV Bharat / state

'తండ్రి సంతకం లేకపోయినా మైనర్‌కు పాస్‌పోర్టు జారీ చేయొచ్చు' - HC ORDERS ISSUANCE OF PASSPORT

వివాహ బంధం రద్దు అయిన తరువాత మైనర్‌ పిల్లలకు పాస్‌పోర్టు జారీ - తల్లిదండ్రులిద్దరి సంతకం అవసరంలేదని తేల్చి చెప్పిన హైకోర్టు.

HC Orders On Passport To Minor
HC Orders Issuance Of Passport To Minor (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 29, 2024, 9:12 AM IST

HC Orders Issuance Of Passport To Minor :వివాహ బంధం రద్దయిన తర్వాత మైనర్ పిల్లలకు పాస్​పోర్టు జారీలో తల్లిదండ్రులిద్దరి సంతకం అవసరంలేదని హైకోర్టు తెలిపింది. మైనర్ పిల్లల కస్టడీ ప్రత్యేకంగా ఉన్నప్పుడు మరొకరి సంతకం అవసరంలేదని తేల్చిచెప్పింది. దీనికి సంబంధించి చట్టంలో ఎలాంటి నిషేధంలేదని తెలిపింది. తండ్రి సంతకం లేకుండా పాస్​పోర్టు జారీ చేయకపోవడాన్ని సవాలు చేస్తూ 4 ఏళ్ల జైనాబ్ అలియా మహమ్మద్ అనే బాలిక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ మౌసమీ భట్టాచార్య ఇటీవల విచారణ చేపట్టారు.

మైనర్‌కు పాస్‌పోర్టు : పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌ తల్లి డాక్టర్‌ సనా ఫాతిమా భర్త అబ్దుల్‌ ఖదీర్‌కు అమెరికా పౌరసత్వం ఉందని తెలిపారు. ప్రస్తుతం వీరి వివాహం ముస్లిం చట్టం ప్రకారం రద్దయిందని అన్నారు. హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టులో విడాకుల కోసం దాఖలు చేశారన్నారు. ఈ పిటిషన్‌ పెండింగ్‌లో ఉందని వివరించారు.

కుమార్తె జైనాబ్‌ అలియా మహమ్మద్‌కు పాస్‌పోర్టు కోసం ఆమె దరఖాస్తు చేసుకుంటే అమెరికాలో ఉన్న తండ్రి సంతకం కావాలని పాస్‌పోర్టు అధికారులు సెప్టెంబరు 10న దరఖాస్తు తిరస్కరించారని తెలిపారు. కేంద్రం తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. విదేశీ పౌరసత్వం ఉన్న, భారతీయ పౌరసత్వం వదులుకున్న తల్లిదండ్రుల పిల్లలు పాస్​పోర్టు పొందడానికి నిబంధనలకు కట్టుబడి ఉండాలని చెప్పారు.

తండ్రి సంతకం లేకపోయినా మైనర్‌కు పాస్‌పోర్టు జారీ : వాదనలను విన్న న్యాయమూర్తి మైనర్‌ పిల్లలకు సింగిల్‌ పేరెంట్‌ పాస్‌పోర్టుకు దరఖాస్తు చేయరాదంటూ 1967 పాస్‌పోర్టు చట్టం, 1980 నిబంధనల్లో ఎక్కడా లేదన్నారు. మైనర్‌ పిల్లల ప్రత్యేక కస్టడీ ఉంటే సింగిల్‌ పేరెంట్‌ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మైనర్‌ పిల్లల పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకోకుండా నిరోధించడం తల్లిదండ్రులతో పాటు, పిల్లల హక్కులకు విరుద్ధమని తెలియజేశారు.

పాస్‌పోర్టు జారీ చేయాలని హైకోర్టు ఆదేశం : ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు ఎంత వరకు కలిసి ఉంటారన్నది చెప్పలేమని వ్యాఖ్యానించారు. ఈ కేసులో పిటిషనర్‌ తండ్రి అందుబాటులో లేరని తెలిపారు. పిటిషనర్‌ తల్లిపై ఎలాంటి క్రిమినల్‌ కేసులు కూడా లేవని వివరించారు. అంతేకాకుండా కోర్టులో ఉన్న వివాదాలతో పాటు అన్ని పత్రాలను సమర్పించారన్నారు. బాలిక తల్లి సంరక్షణలోనే ఉందని, అందువల్ల తండ్రి సంతకంతో నిమిత్తం లేకుండా పాస్‌పోర్టు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది.

ఇలా చేస్తే 2 రోజుల్లోనే పాస్​పోర్ట్ అపాయింట్​మెంట్ - అదీ మీకు అత్యంత దగ్గర్లోనే

మీపై కేసులున్నాయా? - అయినా మీకు పాస్​పోర్టు కావాలా? - ఐతే ఈ సర్టిఫికెట్ మస్ట్ - CRIMINAL CASE AFFECT ON PASSPORT

ABOUT THE AUTHOR

...view details