High Court on Merger of Gram Panchayats in Telangana : శంషాబాద్ మండలంలో 51 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేయడంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో 4 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలంటూ పురపాలకశాఖ, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శులు, న్యాయశాఖ కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. శంషాబాద్ మండలంలోని 51 పంచాయతీలను శంషాబాద్ మున్సిపాలిటీలో విలీనం చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను సవాలు చేస్తూ మాజీ సర్పంచి పద్మావతి, మరో నలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాదే, జస్టిస్ జె శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
చిన్న గోల్కొండ, పెద్దగోల్కొండ, బహదూర్‌గూడ, హమీదుల్లానగర్, రషీద్‌గూడ తదితర గ్రామాల ప్రజలు విలీనాన్ని వ్యతిరేకిస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది సంజన కోర్టుకు తెలిపారు. పట్టణీకరణతో సహజ జీవనానికి ఇబ్బందులు ఎదురవుతాయని, జీవన వ్యయం పెరిగిపోతుందన్నారు. పట్టణీకరణ పేరుతో గ్రామీణ వాతావరణం దెబ్బతింటుందని, పన్నుల పెంపు ఉంటుందన్నారు. పంచాయతీ సర్పంచులు సొంత నిధులతో పంచాయతీలను అభివృద్ధి చేశారని, విలీనం జరిగితే వాటిని ప్రభుత్వం రాబట్టుకోవడం కష్టమన్నారు. వాదనలను విన్న ధర్మాసనం కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
మేడ్చల్ మల్కాజిగిరిలో హైడ్రాకు హైకోర్టు నోటీసులు :మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి మండలం నిజాంపేటలో ఎర్రకుంట ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ మ్యాప్స్ ఇన్‌ఫ్రా పై నమోదు చేసిన క్రిమినల్ కేసుకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ హైడ్రాకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆక్రమణలపై నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసును కొట్టివేయాలంటూ మ్యాప్స్ ఇన్‌ఫ్రా తరఫున మేనేజింగ్ ఫార్టనర్ సుధాకర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.