HC on Medical Colleges admissions for Locals :ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులలో ప్రవేశాలకు స్థానికత అంశంపై హైకోర్టు తీర్పు విలువరించింది. స్థానికంగా నివాసం ఉండే విద్యార్థులను స్థానికులుగా పరిగణించాలని, అయితే స్థానికత విషయంలో ప్రభుత్వ మార్గనిర్దేశకాలు సరిగా లేవని ధర్మాసనం తెలిపింది. ఈ మేరకు సరైన మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ మార్గ నిర్దేశకాలకనుగుణంగా కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో స్థానికత అంశంపై ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ పలువురు నీట్ విద్యార్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. నీట్ రాసే సమయానికి వరుసగా నాలుగేళ్లు రాష్ట్రంలో చదివిన విద్యార్థులనే స్థానికులుగా పరిగణించాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. దీని వల్ల తెలంగాణ విద్యార్థుల్లో కొంతమంది స్థానికేతరులు అవుతున్నారని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. నీట్లో సీటు సాధించాలని లక్ష్యంతో కొంత మంది విద్యార్థులు పక్క రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ చదివారని, పదో తరగతి వరకు రాష్ట్రంలోనే చదివి కేవలం ఇంటర్మీడియట్ పక్క రాష్ట్రాల్లో చదవడం వల్ల స్థానికేతరులుగా మారుతున్నారని వాదించారు.
ప్రభుత్వ మార్గనిర్దేశకాలు విడుదల తర్వాతే ప్రవేశాలు :తల్లిదండ్రుల ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా కొంతమంది విద్యార్థులు పదో తరగతి లేదా ఇంటర్మీడియట్ ఇతర రాష్ట్రాల్లో చదవాల్సి వచ్చిందని, అలాంటి విద్యార్థులు కూడా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో స్థానికేతరులుగా మారాల్సి వస్తుందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు సీజే ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.