తెలంగాణ

telangana

ETV Bharat / state

గేటెడ్ కమ్యూనిటీల్లో ఏం చేయాలి - ఏం చేయకూడదో స్పష్టంగా చెప్పండి : హైకోర్టు - HIGH COURT ON GATED COMMUNITIES

గేటెడ్‌ కమ్యూనిటీల నిర్వహణ మార్గదర్శకాలపై అధికారులకు కీలక ఆదేశాలు, సూచనలు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు

Telangana High Court on Gated Community Guidelines
Telangana High Court on Gated Community Guidelines (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 2, 2025, 9:22 AM IST

Telangana High Court on Gated Community Guidelines : గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తున్న వాళ్లకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిబంధనలు రూపొందించాలని తెలంగాణ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. చేసే పనులు, చేయకూడని పనులు రూపొందించి వాటిని గేటెడ్ కమ్యూనిటీలో ఉండే ఎగ్జిక్యూటివ్ కమిటీలకు అందించాలని ఆదేశించింది. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఇందు ఫార్చ్యూన్ ఫీల్డ్ విల్లాలో నిర్వహిస్తున్న పార్టీల్లోని సౌండ్ సిస్టమ్‌ వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. క్లబ్ హౌస్‌ల్లో నిర్వహించే కార్యకలాపాలతో స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.

మెరుగైన జీవన శైలి, శాంతి, గౌరవప్రదమైన ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి సామరస్యం, మెరుగైన సౌకర్యాలు, వ్యాయామ శాల, క్రీడా సౌకర్యాలు, ఉద్యాన వనాలు, తదితర సౌకర్యాలుంటాయన్న ఉద్దేశంతో ఎక్కువ మంది గేటెడ్ కమ్యూనిటీని ఎంచుకుంటున్నారని హైకోర్టు తెలిపింది. గేటెడ్ కమ్యూనిటీ కార్యకలాపాల నిర్వహణకు సంబంధించి ప్రత్యేక చట్టం ఉందన్న వివరాలేవీ లేవని, ప్రస్తుతం గేటెడ్ కమ్యూనిటీలతో పాటు ఫ్లాట్ అసోసియేషన్లు తెలంగాణ అపార్ట్మెంట్ చట్టం నిబంధనల కింద నడుస్తున్నాయని హైకోర్టు పేర్కొంది.

వివరాలు గోప్యంగా ఉంచాలి :ప్రస్తుతం గేటెడ్ కమ్యూనిటీలతో పాటు ఫ్లాట్ అసోసియేషన్‌లు తెలంగాణ అపార్ట్మెంట్ చట్టం నిబంధనల కింద నడుస్తున్నాయని హైకోర్టు పేర్కొంది. గేటెడ్ కమ్యూనిటీలో జరిగే అసాంఘిక, చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నియంత్రణకు చర్యలు చేపట్టే అధికారం పోలీసులకు ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలతో పాటు అనుసరించాల్సిన చట్ట నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వులను కూడా అందజేయాలని పేర్కొంది. నిబంధనలు అతిక్రమించిన వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. అవసరం అయితే కమ్యూనిటీల్లో ఫిర్యాదుల స్వీకరణకు ఆయా పోలీస్‌స్టేషన్ పరిధిలో యాప్‌ను రూపొందించే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. యాప్స్ ద్వారా ఫిర్యాదు చేసేవారి వివరాలను గోప్యంగా ఉంచాలని హైకోర్టు నిర్దేశించింది.

మార్గదర్శకాలు, సూచనలు రూపొందించాల్సిన సమయం ఇదే :విక్రయ ఒప్పందాల్లో అసోసియేషన్ సభ్యత్వం తప్పనిసరని, అలాంటి కమ్యూనిటీల్లో అంతర్గత విభేదాలు, అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నా పట్టించుకోవడంలేదని హైకోర్టు తెలిపింది. చాలామంది నివాసితులు ధనిక వర్గానికి చెందినవారు కావడంతో అధికారులు, పోలీసులపై వారి ప్రభావం ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడింది. ఇలాంటి ప్రాంతాల్లో ఎవరైనా ఒంటరిగా శక్తివంతమైన, మెజారీటీ సభ్యులను ఎదుర్కొవడం కష్టమేనని మెరుగైన జీవన ప్రమాణాల కోసం విల్లాలు, ప్లాట్లతో సహా గేటెడ్ కమ్యూనిటీల్లో నివాసం ఉండాలనుకునేవారి సంఖ్య నానాటికీ పెరుగుతుండంతో గేటెడ్ కమ్యూనిటీల అంతర్గత నిర్వహణ కోసం ప్రభుత్వం నిర్దిష్ట మార్గదర్శకాలు, సూచనలు రూపొందించాల్సిన సమయం ఇదేనని హైకోర్టు తెలిపింది.

గేటెడ్ కమ్యూనిటీలోని రోడ్లపై ఎవరైనా వెళ్లొచ్చు.. వారికి మాత్రమే సొంతం కాదు: హైకోర్టు

నోటీసులిచ్చి 24 గంటలు గడవలేదు, వారి వివరణ తీసుకోలేదు - హైడ్రా కూల్చివేతలపై​ హైకోర్టు ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details