Telangana High Court Notices to Govt on No-Confidence Motions : సదాశివపేట, ఆందోల్-జోగిపేట, జవహర్‌నగర్, జనగామ, ఆలేరు మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్మన్లపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయా మున్సిపల్ కార్పొరేషన్లో జారీ చేసిన అవిశ్వాస తీర్మానం నోటీసుల్లో సింగిల్ జడ్జి జోక్యం చేసుకోకపోవడంతో సదాశివపేట ఛైర్పర్సన్ పి.జయమ్మ, జనగామ ఛైర్పర్సన్ పి.జమున, ఆందోల్-జోగిపేట ఛైర్మన్ జి.మల్లయ్య, జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్పర్సన్ ఎం.కావ్య, ఆలేరు మున్సిపల్ ఛైర్పర్సన్ వి.శంకరయ్యలు ఉన్నత న్యాయస్థానంలో అప్పీళ్లు దాఖలు చేశారు.
ఇల్లందు మున్సిపల్ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం - క్యాంపులో 15 మంది కౌన్సిలర్లు
ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాదే, జస్టిస్ అనిల్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణ మున్సిపల్ చట్టం-2019 సెక్షన్ 37లో అవిశ్వాస తీర్మానం ఆమోదించడానికి సంబంధించిన విధానం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అవిశ్వాసం అనంతర చర్యలపై కూడా స్పష్టత లేదని, నిబంధనలు రూపొందే దాకా, అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టరాదన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ కౌన్సిలర్లు ఇచ్చిన వినతి పత్రాల మేరకు సమావేశం నిర్వహణ నిమిత్తం కలెక్టర్లు అవిశ్వాస నోటీసులు జారీ చేయడం సరికాదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు అన్నారు.
మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాల పరంపర - మంచిర్యాల, క్యాతనపల్లి పురపాలకల్లో అలజడి
ప్రభుత్వ వాదన విన్నాక తేలుస్తాం : అప్పీళ్లపై విచారణ ముగిసే దాకా, అవిశ్వాస తీర్మానాలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు. వాదనలను విన్న ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులకు నిరాకరించింది. మూడు, నాలుగు రోజులకు ఏమీ కాదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ వాదనను పరిగణనలోకి తీసుకుని కేసును తేలుస్తామని పేర్కొంటూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లతో పాటు సంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి భువనగిరి జిల్లా, జనగామ కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. నోటీసులపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ, విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.
నల్గొండ మున్సిపాలిటీని కోల్పోయిన బీఆర్ఎస్ - అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన కాంగ్రెస్
అవిశ్వాసాల జోరు : అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారిన అవిశ్వాస తీర్మానాలు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత ఎక్కువయ్యాయి. అసంతృప్తులను ఎక్కడికక్కడ బుజ్జగించేందుకు ముఖ్య నేతలు రంగంలోకి దిగినా ప్రయోజనం ఉండటం లేదు. ఈ అంశంపై మాజీ మంత్రి మల్లారెడ్డి ఇటీవల స్పందించడం క్షేత్రస్థాయిలో పరిస్థితికి అద్దం పడుతుంది. తాజాగా సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఛైర్మన్‌పై కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానానికి 13 మంది సభ్యులు హాజరైనట్లు ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి వెల్లడించారు. మద్దతు తెలపడంతో నేరేడుచర్ల మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానం నెగ్గిందని తెలిపారు.
మళ్లీ తెరపైకి పుర అవిశ్వాసాలు - గవర్నర్ ఆమోదం పొందని అవిశ్వాసాల సవరణ బిల్లు