Telangana High Court Decision on Group 1 Exams :ఎట్టకేలకుగ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు లైన్ క్లియరైంది. తెలంగాణ గ్రూప్-1 పరీక్షలకు దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. దీంతో షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 21తేదీ నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ప్రిలిమ్స్‌లోని 7 ప్రశ్నలకు తుది 'కీ'లో సరైన జవాబులు ఇవ్వలేదని, ఏడు ప్రశ్నలకు మార్కులు కలిపి మళ్లీ జాబితా ఇవ్వాలని కోరిన పిటిషనర్లు దాఖలు చేయగా తాజాగా వాటిని హైకోర్టు కొట్టివేసింది.
సుప్రీంకోర్టును ఆశ్రయించిన గ్రూప్-1 అభ్యర్థులు - ఆ జీవో రద్దు కోరుతూ పిటిషన్
నోటిఫికేషన్ చెల్లదంటూ, సమాధానాలు తప్పంటూ పిటిషన్లు : 2022లో జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదని, ప్రాథమిక కీలో తప్పులున్నాయని వాటిని సవరించాలన్న అభ్యంతరాలను కూడా పట్టించుకోలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. గతంలో గ్రూప్1 నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ ఇదే హైకోర్టు పరీక్షను రద్దు చేసిందని గుర్తుచేశారు. వందల పోస్టులను భర్తీ చేయడానికి నిర్వహిస్తున్న పరీక్షలకు లక్షల మంది ప్రిలిమ్స్ రాశారని, టీజీపీఎస్సీ వెలువరించిన తుది 'కీ'లో కూడా 7 ప్రశ్నలకు సమాధానాలు తప్పుగా ఉన్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ ప్రశ్నలను తొలగించి తాజా 'కీ'ని రూపొందించి అభ్యర్థుల జాబితా సిద్ధం చేయాలని కోరారు.
వాళ్ల ఆమోదం తర్వాతే ఫలితాలు :గ్రూప్1 ప్రిలిమ్స్ రాసిన 3 లక్షల మంది అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు కోరగా 721 మంది భౌతికంగా, 6470 అభ్యంతరాలను ఆన్‌లైన్‌లో స్వీకరించినట్లు టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అభ్యంతరాలన్నింటినీ సబ్జెక్టుల వారీగా నిపుణుల కమిటీకి పంపించి వారి ఆమోదం తర్వాతే ఫలితాలు విడుదల చేసినట్లు తెలిపారు.