HC Discontent Of State Govt Counter Issue : అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం ఐఏఎంసీకి భూ కేటాయింపు, నిధుల కేటాయింపు, ప్రభుత్వ కేసులను ఆర్బిట్రేషన్ కేంద్రానికి పంపాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లో ప్రభుత్వం కౌంటరు దాఖలు చేయకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కౌంటరు దాఖలు చేసే దాకా రోజుకు రూ.వెయ్యి చొప్పున రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని ఆదేశిస్తూ విచారణను సెప్టెంబరు 20వ తేదీకి వాయిదా వేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్‌లో 3.70 ఎకరాలను ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మేడియేషన్ సెంటర్‌కు కేటాయిస్తూ 2021 డిసెంబరు 26న ప్రభుత్వం జీవో జారీ చేసింది.
దీంతో పాటు ఏడాదికి రూ.3 కోట్ల ఆర్థిక సాయం చేస్తూ జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ, వ్యక్తిగత హోదాలో న్యాయవాది కోటి రఘునాథరావు, మరో న్యాయవాది ఏ వెంకట్రామిరెడ్డిలు గత ఏడాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ కె.సుజనలతో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ఐఏఎంసీ తరఫు న్యాయవాది ఎం.అభినయ్ రెడ్డి కౌంటరు దాఖలు చేసినట్లు తెలిపారు. ఇతర ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శుల తరఫున కౌంటరు దాఖలు చేయడానికి, మరికొంత గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరగా ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇంతటి కీలకమైన విషయంలో కౌంటరు ఎందుకు దాఖలు చేయరని ప్రశ్నించింది. తదుపరి విచారణను సెప్టెంబరు 20కి వాయిదా వేస్తూ, అప్పటిలోగా కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. కౌంటరు దాఖలు చేసే రోజు వరకు రోజుకు రూ.1000 చొప్పున రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.