తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయం సరైనదే : హైకోర్టు - TG HC on Bhoodan Yagna Board

High court on Bhoodan Yagna Board : భూదాన్ యజ్ఞ బోర్డును రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని హైకోర్టు పేర్కొంది. భూదాన్ బోర్డును రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని, రికార్డులను పరిశీలిస్తే బోర్డు చట్టబద్ధంగా ఏర్పాటైనట్లు లేదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమంటూ పిటిషనర్లు దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టివేసింది.

TG HC BHOODAN YAGNA BOARD
High court on Bhoodan Yagna Board (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 8, 2024, 9:36 PM IST

Telangana High Court on Bhoodan Yagna Board Cancellation : భూదాన్ యజ్ఞ బోర్డును రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సబబేనంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. భూదాన్ బోర్డును రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని, దాన్ని ప్రశ్నించే చట్టబద్ధమైన హక్కు మాజీ ఛైర్మన్, సభ్యులకు లేదని తేల్చి చెప్పింది. భూదాన్ బోర్డు నిర్వహణ నిమిత్తం ప్రత్యేక అధికారిగా రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శిని నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వు సబబేనంటూ పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమంటూ ఛైర్మన్, సభ్యులు దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టివేసింది.

భూదాన్ బోర్డును రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 59ను సవాలు చేస్తూ భూదాన్ యజ్ఞ బోర్డు ఛైర్మన్ జి.రాజేందర్ రెడ్డి, సభ్యులు సుబ్రమణ్యం తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సింగిల్ జడ్జి పిటిషన్ కొట్టివేయడంతో వారు అప్పీలు దాఖలు చేశారు. అప్పీలుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె. శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. 2012లో ఉమ్మడి ఏపీలో భూదాన్ యజ్ఞ బోర్డు ఛైర్మన్ రాజేందర్ రెడ్డి, సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. రాష్ట్ర విభజన తరువాత భూదాన్ బోర్డును రద్దు చేస్తూ ప్రత్యేక అధికారిని నియమిస్తూ ప్రభుత్వం జీవో 11 జారీ చేసిందన్నారు.

ఫోర్జరీ లేఖ ఆధారంగా వీరి నియామకం : దీనిపై విచారించిన హైకోర్టు జీవోను కొట్టివేసి, బోర్డు ఛైర్మన్ సభ్యులను కొనసాగించాలని 2015లో తీర్పు వెలువరించిందని గుర్తు చేశారు. అనంతరం ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసిందని, సమర్పించిన వివరణను పరిగణనలోకి తీసుకోకుండా బోర్డును రద్దు చేసిందన్నారు. షోకాజ్ నోటీసులో గానీ, జీవోలో గానీ బోర్డు రద్దుకు కారణాలు పేర్కొనలేదన్నారు. ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ దిల్లీలోని మహిళా చేతన్ కేంద్ర అధ్యక్షురాలు డాక్టర్ వినాబెహన్ పేరుతో ఫోర్జరీ లేఖను సృష్టించారని, దాని ఆధారంగా ప్రభుత్వం వీరి నియామకం చేపట్టిందన్నారు. అయితే వాస్తవానికి వినాబెహన్ అలాంటి లేఖను రాయలేదని, తనకు వినోబా భావేకు చెందిన సర్వ సేవా సంఘ్ ఎలాంటి అధికారాలు అప్పగించలేదని ప్రభుత్వానికి లేఖ రాశారన్నారు.

భూదాన్ బోర్డు చట్టబద్ధంగా ఏర్పాటైనట్లు లేదు :అంతేగాకుండా ఛైర్మన్, సభ్యులు బోర్డుకు చెందిన ఆస్తులను అన్యాక్రాంతం చేశారని, అనర్హులకు పంపిణీ చేశారని, వీరిపై పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం రికార్డులను పరిశీలిస్తే భూదాన్ బోర్డు చట్టబద్ధంగా ఏర్పాటైనట్లు లేదని పేర్కొంది. అంతేగాకుండా అప్పీలుదారులు ఇబ్రహీంపట్నంలో 150 ఎకరాలు విక్రయించడం, 35 ఎకరాలు ఎస్.వి.ఎస్. రైతు డైయిరీకి లీజుకు, 15 ఎకరాలు గోపాల్ గోశాల ట్రస్ట్​కు లీజుకు ఇవ్వడం, శంషాబాద్​లో 32 ఎకరాలను అనర్హులకు కేటాయించడం, బాటసింగారంలో 16 ఎకరాల్లో ఇళ్ల ప్లాట్ల విక్రయం తదితర ఆరోపణలను సింగిల్ జడ్జి తీర్పులో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించింది.

ప్రభుత్వం షోకాజ్ నోటీసు ఇచ్చిందని, అందులో అన్ని వివరాలను సమగ్రంగా పేర్కొందని, దీనికి అప్పీలుదారులు సమాధానం కూడా ఇచ్చారని హైకోర్టు పేర్కొంది. వారిపై క్రిమినల్ కేసులున్నాయన్న దానిపై విభేదించడంలేదంది. అందువల్ల భూదాన్ బోర్డును రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదంటూ అప్పీళ్లను కొట్టివేసింది.

ABOUT THE AUTHOR

...view details