Groups Aspirants Problems In Telangana :రాష్ట్రంలో గ్రూప్ సర్వీసు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు నమూన పరీక్షలు (టెస్ట్ ఎగ్జామ్స్) ఆర్థిక భారంగా మారుతున్నాయి. కొన్ని ప్రైవేట్ శిక్షణ సంస్థలు నిర్వహిస్తున్న ఈ ఎగ్జామ్స్‌కు ఫీజులు రూ.వేలల్లో వసూలు చేస్తున్నాయి. గ్రూప్-1 ప్రధాన పరీక్ష, గ్రూప్-2 పరీక్షల కోసం నగరానికి వచ్చి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు లేవు.
నెల జీతం ముందే పూచీకత్తు :గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ చూపినప్పటికీ, ప్రధాన పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు తిప్పలు తప్పడం లేదని వాపోతున్నారు. శిక్షణ సంస్థలు నిర్వహిస్తున్న టెస్ట్ సిరీస్‌కు కేటగిరీ వారీగా రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు ఫీజు తీసుకుంటున్నారు. కొన్ని సంస్థలు ఈ ఫీజులతో పాటు అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే, నెల జీతం ఇచ్చేలా వారి నుంచి పూచీకత్తు తీసుకుంటున్నారు. అభ్యర్థులకు ఈ విధంగా ఫీజులు భారంగా మారుతున్నాయి.
అక్టోబరు 21 నుంచి గ్రూప్-1 ప్రధాన పరీక్షలు జరగనున్నాయి. ప్రిలిమినరీ పరీక్షకు 3 లక్షల మంది పోటీపడగా, మెయిన్స్‌కు 31,382 మంది ఎంపికయ్యారు. వారు ఒకవైపు సబ్జెక్టుల వారీగా ప్రిపేర్ అవుతూనే, టెస్ట్ సిరీస్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. వాటిని రాస్తే తమ లోపాలు తెలుస్తాయని, వాటిని సరిదిద్దుకునే వీలుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు శిక్షణ సంస్థలు వారానికో టెస్ట్ సిరీస్ చొప్పున పెడుతున్నాయి.
గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్నారా.. ఈ టిప్స్ ట్రై చేయండి జాబ్ పక్కా..!
అద్దె భవనాల్లో స్టడీ హాళ్లు :పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం ప్రైవేటు స్టడీ హాళ్లు విపరీతంగా పెరుగుతున్నాయి. గ్రూప్-2 పరీక్ష తేదీలు ఖరారు కావడంతో ఈ పరీక్ష కోసం దాదాపు 5 లక్షల మంది అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు. నిరుద్యోగ అభ్యర్థుల తాకిడి నేపథ్యంలో ఇప్పటి వరకు శిక్షణ ఇచ్చిన సంస్థలు ఆయా కేంద్రాలను స్టడీ హాళ్లుగా మార్చుతున్నాయి.