Telangana Group-1 Hall Tickets : రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు టీజీపీఎస్సీ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఇవాళ గ్రూప్-1 హాల్ టికెట్లను విడుదల చేసింది. అభ్యర్థులకు సంస్థ వెబ్సైట్లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. జూన్ 9న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. పరీక్ష షెడ్యూల్ ప్రకారం ఇవాళ హాల్‌టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ప్రిలిమ్స్ పరీక్షను ఒక్కరోజులోనే పూర్తి చేసేందుకు ఓఎంఆర్ పద్దతిలో నిర్వహించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షకు 4.03 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
TGPSC Group 1 Prelims : 2022లో ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దు చేసిన కమిషన్ 563 ఉద్యోగాలతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త ప్రకటనను జారీ చేసింది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 16 వరకు ఆన్‌లైన్లో అప్లికేషన్లు పెట్టుకునేందుకు అవకాశం కల్పించింది. పరీక్ష కేంద్రాల గుర్తింపు, భద్రతా ఏర్పాట్లు తదితర బాధ్యతలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో, టెలి కాన్ఫరెన్స్ నిర్వహించింది. గతంలో ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్ష నిర్వహణలో లోపాలతో ప్రిలిమ్స్ రద్దయింది. ఈ నేపథ్యంలో ఈసారి పరీక్షలకు పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. నిబంధనలు పాటించడంలో అభ్యర్థులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
TGPSC Group 1 Prelims Guidelines :ప్రిలిమ్స్ రాసే అభ్యర్థులకు కొన్ని సూచనలు చేస్తూ టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ వెబ్‌నోట్ జారీ చేశారు. అభ్యర్థులకు వ్యక్తిగత వివరాలతో కూడిన ఓఎంఆర్ పత్రాలు అందజేస్తామని వెల్లడించింది. పరీక్ష సమయంలో ఫొటో బయోమెట్రిక్, వేలిముద్ర తప్పనిసరిగా ఇవ్వాలని, అలా ఇవ్వలేని వారిని అనర్హులుగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఈ బయోమెట్రిక్‌ను నియామక ప్రక్రియ వివిధ దశల్లో వివరాలు సేకరిస్తామని తెలిపింది.