Telangana Graduate MLC By Election Counting 2024 : ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ సుధీర్ఘంగా సాగనుంది. నాలుగు హాళ్లలో 96 టేబుళ్లపై 3,36,013 ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఓట్లను బ్యాలెట్ బాక్సుల వారీగా తీసుకొచ్చి ఓపెన్ చేసి 25 ఓట్లను ఒక బండిల్‌గా కట్టారు. బండిల్స్ కట్టే ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. రాత్రి 11 గంటల వరకు పూర్తయ్యే అవకాశం ఉంది. పోలైన ఓట్లలో చెల్లని ఓట్లను తీసేసి, చెల్లిన ఓట్లు లెక్కిస్తారు. చెల్లిన ఓట్లను పరిగణలోకి తీసుకుని 50 శాతంపైన ఒక్క ఓటు వచ్చిన అభ్యర్థిని గెలిచినట్లుగా ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో అలా రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు.
నేడే జడ్జిమెంట్ డే - పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు
Graduate MLC By Election Results 2024: మొదటి ప్రాధాన్యత ఓట్ల ద్వారా పోటీ చేసిన అభ్యర్థుల్లో గెలుపు కోసం నిర్ణయించిన టార్గెట్ ఓట్లు ఎవరికీ రాకపోతే మొదటి ప్రాధాన్యత ఓట్లలో తక్కువగా ఓట్లు వచ్చిన చివరి అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తారు. ఎలిమినేట్ అయిన ఆ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఇచ్చిన ఓటర్లు, రెండో ప్రాధాన్యత ఏయే అభ్యర్థులకు ఇచ్చారో చూసి, ఆ ఓట్లను ఆయా అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యతలో వచ్చిన ఓట్లకు కలుపుతారు. అలా కలిపిన రెండో ప్రాధాన్యత ఓట్లతో టార్గెట్ వస్తే గెలిచినట్లు ప్రకటిస్తారు. అప్పటికీ గెలిచేందుకు ఓట్లు సరిపడా రాకపోతే తక్కువగా ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తూ గెలుపు టార్గెట్ వచ్చేంత వరకు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును కొనసాగిస్తారు.