CM Revanth Focus On Musi River Development : హైటెక్ సిటీ చూస్తే నారా చంద్రబాబునాయుడు, అంతర్జాతీయ విమానాశ్రయం చూస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాగే పదేళ్ల తర్వాత మూసీ నది చూస్తే ప్రజాప్రభుత్వం గుర్తుకు వస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌కు తలమానికంగా నిలిచే మూసీ నదిని లక్షా 50 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు.
ఇందుకు సంబంధించిన పనులను త్వరలోనే మొదలుపెట్టనున్నట్లు ప్రకటించిన రేవంత్ రెడ్డి, లండన్ థేమ్స్ నదిలా మూసీని సుందరీకరిస్తామని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో ప్రపంచ పర్యాటకులు మూసీని సందర్శించేలా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. నగర శివారు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గోపన్‌పల్లి తండా వద్దా 28 కోట్ల రూపాయలతో నిర్మించిన పై వంతెనను సీఎం లాంఛనంగా ప్రారంభించారు. జెండా ఊపి ఉమెన బైకర్స్‌ను ఫ్లైఓవర్ బ్రిడ్జిపైకి అనుమతించారు.
మూసీ అంటే ముక్కు మూసుకునే పరిస్థితి :మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి సహా స్థానిక ప్రజాప్రతినిధులు వంతెన ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి అభివృద్ధికి గోపన్‌పల్లి పైవంతెన దోహదపడుతుందన్న ముఖ్యమంత్రి, శేరిలింగంపల్లి వేగంగా అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుందన్నారు. ఇటీవలే హైదరాబాద్ నగరంలో సమస్యల పరిష్కారానికి విపత్తుల నిర్వహణకు హైడ్రా అనే నూతన వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.