Telangana Govt Thinkin Land Map Mandatory For Registration :భూముల రిజిస్ట్రేషన్-మ్యుటేషన్ సమయంలో ఆ భూమికి సంబంధించిన పటం (మ్యాప్) జోడించడం తప్పనిసరి చేయాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ విధానం అమలు చేస్తే భూ వివాదాలు, డబుల్ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తోంది. కర్ణాటకలో 2008వ సంవత్సరం నుంచి దశలవారీగా దీన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానం సత్ఫలితాలనిస్తోందని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనగా, ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి, సునీల్‌కుమార్ ఈ నెల 5వ తేదీన కర్ణాటక వెళ్లి, అక్కడి రెవెన్యూ చట్టాలను అధ్యయనం చేశారు. తెలంగాణ భౌగోళిక వాతావరణం, ప్రస్తుత చట్టాల నేపథ్యంలో ఎలాంటి మార్పులను చేయవచ్చనే విషయంపై ఆ రాష్ట్ర రెవెన్యూ మంత్రితో చర్చించారు.
కొత్త చట్టం తీసుకువచ్చే యోచనలో సర్కార్ :తెలంగాణలో 1936లో భూముల సర్వే జరిగింది. ఆ సమయంలో నిర్ణయించిన భూమి హద్దుల ఆధారంగానే ఇప్పటికీ దస్త్రాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో భూముల సమగ్ర సర్వే చేపట్టడానికి గత ప్రభుత్వ హయాంలో పలుమార్లు ప్రయత్నాలు జరిగినా, పలు కారణాల వల్ల ముందడుగు పడలేదు. ప్రస్తుత ప్రభుత్వం కూడా సమగ్ర సర్వే చేపట్టాలన్న యోచనతో ఉంది. దీని కన్నా ముందు ఆర్వోఆర్ - 2020, ధరణి పోర్టల్‌తో ఉత్పన్నమైన భూ యాజమాన్య హక్కులు, సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని భావిస్తోంది. అందుకోసం ప్రస్తుత చట్టం స్థానంలో కొత్త చట్టం తీసుకొచ్చే కార్యాచరణ జరగుతోంది.
సమగ్ర సర్వే చేపట్టేలోపు భూ సమస్యలకు కొంతవరకైనా అడ్డుకట్ట వేయాలని సర్కారు యోచిస్తోంది. అందులో భాగంగానే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్లకు కర్ణాటక తరహాలో భూముల పటాలను జత చేస్తే వివాదాలకు అడ్డుకట్ట పడుతుందన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కమిటీ సభ్యులు చర్చించిన తర్వాత ఈ విధానంపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.