Telangana Govt Serious Action on Irrigation Department :అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీటి పారుదల శాఖలో ఇద్దరు కీలక సీనియర్ ఇంజినీర్ ఇన్ చీఫ్‌లను తప్పించింది. ఈఎన్సీ జనరల్ మురళీధర్‌రావును రాజీనామా చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఆదేశించారు. రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లును తొలగిస్తూ నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఇచ్చిన నివేదికను పూర్తిస్థాయిలో పరిశీలించిన అనంతరం తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Telangana ENC General Muralidhar Rao Resigns :మురళీధర్, వెంకటేశ్వర్లు ఇరువురూ పదవీ విరమణ చేసిన అనంతరం కూడా ఈఎన్సీలుగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మురళీధర్‌రావు పదవీ విరమణ అయిన దశాబ్దం తర్వాత కూడా అదే బాధ్యతల్లో ఉన్నారు. మేడిగడ్డ ఆనకట్ట (Medigadda Barrage) డిజైన్ మొదలు నిర్మాణం, నాణ్యత, నిర్వహణ ఇలా ప్రతి దశలోనూ లోపాలు ఉన్నాయని విజిలెన్స్ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. బాధ్యతగా వ్యవహరించాల్సిన ఇంజినీర్లు, జవాబుదారీతనంతో నడుచుకోలేదని వ్యాఖ్యానించినట్లు సమాచారం.
'మేడిగడ్డ ఒప్పందాలు ముగిశాయి - పనులు చేయాలంటే కొత్త కాంట్రాక్ట్ ఇవ్వాల్సిందే'
Minister Uttam ordered ENC General Resign :నిబంధనలు పాటించలేదని, నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారని, నిర్వహణ కూడా సరిగా లేదని విజిలెన్స్ చెప్పినట్లు తెలిసింది. ప్రతి దశలోనూ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని, సమస్యలు వెలుగులోకి వచ్చినప్పటికీ సరిగా స్పందించలేదని, విధి నిర్వహణలో పూర్తి అలక్ష్యం ఉందని ఆక్షేపించినట్లు సమాచారం. గుత్తేదారుతో జరిపిన ఉత్తర, ప్రత్యుత్తరాలు, ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలు సహా ఇతరత్రా విషయాల్లో ఇంజినీర్ల వైఖరిని విజిలెన్స్ తప్పుపట్టినట్లు తెలిసింది.