Power Plants Crop Field In Telangana :విద్యుత్తు వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి జరగక కొరత ఏర్పడుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సౌర విద్యుత్తు ఉత్పత్తిని ప్రోత్సహిస్తోంది. సాగులో లేని బీడు, వ్యవసాయ యోగ్యం కాని భూముల్లో సోలార్ విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో వ్యక్తులు, సంస్థలను సోలార్ పవర్ ప్లాంట్ పెట్టేలా ప్రోత్సహిస్తోంది. ఇందుకు పీఎం కుసుమ్ పథకం వినియోగించుకునేలా అవగాహన కల్పిస్తోంది. సౌరశక్తితో విద్యుత్తు ఉత్పత్తి చేసి వారికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తోంది. దరఖాస్తులకు ఈ నెల 22 ఆఖరు తేదీ కావడంతో డిస్కం జిల్లా అధికారులు ఔత్సాహికులను ఆకట్టుకునేలా ప్రచారం చేస్తున్నారు.
సౌర విద్యుత్తు కేంద్రాలు : నిర్మల్ జిల్లాలో ఇప్పటికే రెండు సౌర విద్యుత్తు కేంద్రాలు ఉన్నాయి. 33/11 కేవీ ఉపకేంద్రాలకు 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న భూముల్లో 500 కిలోవాట్ల నుంచి 2 మెగావాట్ల సామర్థ్యం వరకు కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్ఛు. ఒక్కో మెగావాట్ ప్లాంటు ఏర్పాటు కోసం సుమారు 3.5 నుంచి 4 ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. తెలంగాణ విద్యుత్తు రెగ్యులేటరీ కమిషనర్ (టీజీఈఆర్సీ) నిర్ణయించిన టారిఫ్ ప్రకారం ఉత్పత్తి చేసిన విద్యుత్తును డిస్కంలు కొనుగోలు చేస్తాయి.
రైతులు, రైతు సమూహాలు, సహకార, వ్యవసాయ ఉత్పత్తి సంఘాలు, నీటి వినియోగదారులు, స్వయం సహాయక సంఘాలు, పంచాయతీలు, గ్రామ సంస్థలు వీటిని నెలకొల్పడానికి అర్హులుగా నిర్ణయించారు. ప్లాంట్ ఏర్పాటు చేయాలనుకునే వారు భూమి లీజు ఒప్పంద పత్రం సమర్పించాల్సి ఉంటుంది.