Medigadda Barrage Repairs in Telangana :మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించి జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు మరమ్మతుల విషయమై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకు సంబంధించిన అంశాలపై నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ(L&T) కంపెనీ ప్రతినిధులతో నీటిపారుదల శాఖ ఈఎన్స్సీ అనిల్ కుమార్ సమావేశమయ్యారు. ఎన్డీఎస్ఏ కమిటీ మధ్యంతర నివేదికలో చేసిన సూచనలకు అనుగుణంగా చేయాల్సిన పనులపై సమావేశంలో చర్చించారు. 'ఓ అండ్ ఎం(O & M)' ఈఎన్సీ నాగేందర్ రావు, ఇతర ఇంజినీర్లు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఎల్ అండ్ టీ సంస్థ ప్రతినిధులు సురేశ్, చౌహాన్ తదితరులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో మరమ్మతులకు సంబంధించిన అంశాలు, చేయాల్సిన పనులపై చర్చ జరిగింది. పని పూర్తి అయినట్లు గతంలో తమకు ధ్రువీకరణ పత్రం ఇచ్చారన్నారు. ఇప్పుడు మరమ్మతులు చేయాలంటే అనుబంధ ఒప్పందం చేసుకోవాలని తెలిపారు. డబ్బులు అధికంగా చెల్లించాల్సి ఉంటుందని ఎల్ అండ్ టీ(L&T) ప్రతినిధులు పునరుద్ఘాటించినట్లు తెలిసింది. అయితే ఒప్పందం, చెల్లింపుల విషయంలో నిబంధనలకు లోబడే ఉంటాయని స్పష్టం చేశారు. ఒప్పందం ప్రకారమే పనులు చేయాలని నీటి పారుదల శాఖ స్పష్టం చేసినట్లు తెలిసింది.
కొనసాగుతోన్న జస్టిస్ ఘోష్ కమిషన్ దర్యాప్తు : ఇప్పటికే మేడిగడ్డ ఆనకట్టపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కమిషన్ రెండు దఫాలుగా రాష్ట్ర పర్యటనకు వచ్చి మేడిగడ్డను సందర్శించి వెళ్లారు. అలాగే నీటిపారుదల శాఖ అధికారులు, ఈఎన్సీలతో కూడా చర్చించారు. ఆనకట్టకు తదుపరి నష్టం జరగకుండా వర్షాకాలం లోపు చేయాల్సిన మరమ్మతులపైనా కమిషన్ దృష్టి సారించింది.