TG Govt On Unauthorised Expenditure in Taxes Department :తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. వచ్చే ఆదాయానికి, చెయ్యాల్సిన ఖర్చులు అక్కడికక్కడే ఉండటంతో ప్రతి రూపాయిని రాష్ట్ర ప్రభుత్వం చూసి ఖర్చు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో వాణిజ్య పన్నుల శాఖ, ప్రభుత్వ అనుమతి లేకుండా రూ.కోట్ల నిధులు ఖర్చు చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. 2023-24 ఆర్థిక ఏడాదిలో ఆఫీస్ అదర్ ఎక్స్‌పెండేచర్ పద్దు కింద వ్యయం చేసుకోడానికి వాణిజ్య పన్నుల శాఖకు రూ.9 కోట్ల 62 లక్షలు ప్రభుత్వం కేటాయించింది. ఈ మొత్తాన్ని ప్రధానంగా కార్యాలయాల్లో జిరాక్స్ మిషన్లకు క్యాట్రిడ్జ్‌లు సమకూర్చుకోవడం, పెన్‌లు, పెన్సిళ్లు, పేపర్లు కొనుగోలు చేయడం, జాతీయ పర్వదినాల రోజున అవసరమైన మేర ఖర్చు చేసుకోడానికి తదితర అవసరాల కోసం ఈ నిధులను వాడుకోవాల్సి ఉంటుంది.
ఇలా రోజువారీ ఖర్చుల కోసం వెచ్చించాల్సిన నిధులు ఇతరత్రా అవసరాలకు ఉపయోగించరాదు. అంటే మొత్తం మీద కార్యాలయాల అడ్మినిస్ట్రేషన్ కోసం మాత్రమే ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉంది. మిగిలితే తిరిగి ప్రభుత్వానికి సరెండర్ చేయాల్సి ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఆ పని చేయలేదు. రూ.5 లక్షల వరకు ప్రభుత్వ అనుమతి లేకుండా ఖర్చు చేసుకునే వెసులుబాటు ఆ శాఖ కమిషనర్‌కు ఉంది. అంతకు మించి వ్యయం చేయాల్సి వస్తే ముందస్తుగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. అనుమతి తీసుకున్నా, నేరుగా కాకుండా తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా టెండర్లు పిలిచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఆడిందే ఆట, పాడిందే పాటగా నిధులు ఖర్చు : అదేవిధంగా నిర్మాణాలు చేయాల్సి వస్తే రహదారులు, భవనాల శాఖ నుంచి అంచనా వేయించడంతో పాటు, డిజైన్ కూడా ఆమోదం పొందాల్సి ఉంటుంది. పనులు కూడా అదే శాఖ చేయిస్తుంది. లేదంటే ఇతర ప్రభుత్వ శాఖల ద్వారా చేయించుకోవాలి. కానీ ఇక్కడ ఆలాంటిదేమీ చేయలేదు. ఇష్టానుసారంగా ఖర్చు చేశారు. ఆ కమిషనర్ ఆడిందే ఆట, పాడిందే పాటగా నిధులు మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేశారు. సాధారణంగా కొత్తగా కమిషనర్ వచ్చినప్పుడు తన ఛాంబర్ సక్రమంగా లేదని భావిస్తే ప్రభుత్వానికి నివేదించి బడ్జెట్ తెప్పించుకోవాలి. ఆ తరువాత ఛాంబర్‌లో మార్పులు, చేర్పులు ఏమేమి చేయాలి, డిజైన్ ఎలా ఉంటుందనే తదితరాలు రహదారులు భవనాల శాఖ అంచనా వేస్తుంది.