Telangana Govt Focus On Bhudhar :ప్రతి భూదస్త్రానికి పక్కాగా గుర్తింపు తీసుకురావాలన్నదే ‘భూధార్’ప్రధాన లక్ష్యం. కేంద్రప్రభుత్వ పథకంలో భాగంగా అన్ని రాష్ట్రాలు అమలుచేస్తున్న ఆ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. ఐతే తాత్కాలిక, శాశ్వత అనే రెండు పద్ధతులను అనుసరిస్తోంది. ప్రతి పౌరుడికీ ‘ఆధార్’ కేటాయించినట్లే దేశంలోని ప్రతి కమతానికీ ఒక విశిష్ఠ సంఖ్యను కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. ఇదే భూధార్. దీనివల్ల ఆస్తులకు రికార్డు ఉంటుంది.
ప్రయోజనాలివే :భూధార్తోకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయం, హక్కులపరంగా గుర్తింపు వంటివి లభిస్తాయి. వ్యవసాయ భూముల మాదిరిగా వ్యవసాయేతర స్థలాలకి ప్రత్యేక నంబరు కేటాయిస్తారు. రాష్ట్రంలో భూధార్ ప్రాజెక్టుని ముందు తాత్కాలికంగా అమలుచేయనున్నట్లు రెవెన్యూ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎదుర్కొంటున్న పలు భూసమస్యలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయడానికి ‘భూధార్’కేటాయింపు తోడ్పడుతుందని రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు.
భూధార్తో ఈ వివరాలు తెలుసుకోవచ్చు :భూదస్త్రాల ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తొలుత సేత్వార్, ఖాస్రా తదితర మాతృదస్త్రాలు పరిశీలించి కమతాలను నిర్ధరించి భూధార్ సంఖ్యను కేటాయిస్తారని రెవెన్యూవర్గాలు చెబుతున్నాయి. సమగ్ర భూసర్వేకన్నా ముందు తాత్కాలిక భూధార్ కేటాయింపు చేపట్టే అవకాశాలున్నాయి. ఇకపై భూధార్ సంఖ్యను నమోదుచేస్తే ఆ రైతు, భూసమాచారం కనిపించనుంది.