AI Powered Smart Glasses for Visually Imperial by KIMS :అంధుల కోసం తీసుకొచ్చిన స్మార్ట్ కళ్లద్దాలు వారి జీవితంలో సరికొత్త వెలుగులు పంచుతాయని, దేశంలో 2 కోట్ల మంది అంధులకు ఇది ఒక భరోసాగా ఉంటుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. ఈ ఏఐ స్మార్ట్ కళ్లద్దాలకు రూపకల్పన చేసిన కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్(కేఎఫ్‌ఆర్‌సీ) బృందాన్ని గవర్నర్ అభినందించారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో గురువారం అంధుల కోసం రూపొందించిన స్మార్ట్ కళ్లద్దాల పంపిణీ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ మనుషులు, వస్తువులను గుర్తించడం లాంటి సామర్థ్యాలు కలిగిన ఏఐ స్మార్ట్ కళ్లద్దాలను ఉచితంగా అంధులకు అందజేయడం గొప్ప విషయని కొనియాడారు.
అంధులకు వివిధ రకాల స్మార్ట్ పరికరాలు తీసుకువచ్చేందుకు కృషి : కిమ్స్ ఆసుపత్రి సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కర్‌రావు మాట్లాడుతూ ఈ అద్దాలు అంధుల్లో మరింత ఆత్మవిశ్వాసం విశ్వాసం వ్యక్తం చేశారు. రోజువారి జీవితంలో ఎంతో సహాయ పడుతుందన్నారు. తొలి విడతలో 100 మందికి ఉచితంగా అందించామని పేర్కొన్నారు. వీటి వాడకంపై అంధులతోపాటు వారి కుటుంబ సభ్యులకు శిక్షణ ఇస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వ్యవస్థాపక ఛైర్మన్ డాక్టర్ జీఎన్‌రావు మాట్లాడుతూ, అంధత్వం, దృష్టిలోపం పెద్ద సమస్యగా మారుతోందని అంధులకు వివిధ రకాల స్మార్ట్ పరికరాలను తీసుకువచ్చేందుకు ఎల్వీప్రసాద్ హాస్పిటల్‌లో సైతం పరిశోధనలు చేస్తున్నామని తెలిపారు. సరిచేయలేని అంధత్వంతో బాధపడేవారికి ఈ అద్దాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.