Telangana Government to Regularize LRS Application :హైదరాబాద్ ఎల్‌ఆర్‌ఎస్ (అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం) దరఖాస్తుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సత్వరమే దరఖాస్తులన్నింటినీ పరిశీలించి, తగు నిర్ణయం తీసుకోవాలని సోమవారం ఆయా సంబంధిత శాఖలను ఆదేశించింది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ ( GHMC) పరిధిలోని దరఖాస్తులకు ముందుకు పోయే మోక్షం లభించినట్లయింది. మూడేళ్ల నిరీక్షణకు ఇప్పుడు తెరపడనుంది. రెండు సంస్థల పరిధిలోని మొత్తం 4.5 లక్షలకు పైగా దరఖాస్తులు అందగా, వాటి ద్వారా హెచ్ఎండీఏకు రూ.1000 కోట్లు, జీహెచ్ఎంసీకి రూ.450 కోట్ల ఆదాయం సమకూరుతుందనే అంచనాలు ఉన్నాయి.
పెండింగ్లో 25 లక్షల ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు - కాంగ్రెస్ సర్కార్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై హెచ్ఎండీఏ (HMDA) ప్రత్యేక దృష్టి పెట్టింది. ఘట్‌కేసర్, శంషాబాద్, శంకర్‌పల్లి, మేడ్చల్ జోన్ల పరిధిలోని దాదాపు 3.46 లక్షల ప్లాట్ల యజమానులు మూడు సంవత్సరాల కిందట క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నారు. ఎక్కువ శాతం దరఖాస్తుల్లో ఘట్‌కేసర్, శంకర్‌పల్లి, శంషాబాద్ ప్రాంతాలవే ఉన్నాయి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే అక్కడ భూముల ధరలు కొద్ది మేర తక్కువ ఉంటాయి. అందుకే ఆదాయం రూ.1000 కోట్లు దాటకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
Layout Regulation Scheme In Telangana : గతంలో 50వేల దరఖాస్తుల పరిశీలన మొదలవగా, ప్రక్రియ వేర్వేరు దశల్లో పని ఆగిపోయిందని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు వారందరికీ మరోమారు మేసేజ్లు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. మార్చి నెల చివరికల్లా ఈ ప్రక్రియ పూర్తిచేయాలనే ఆదేశాల నేపథ్యంలో సంబంధిత అధికారులు అటకెక్కిన దస్త్రాలకు బూజు దులుపుతున్నారు.