Telangana Government To Build Ratan Tata Road :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న స్కిల్ సిటీ, ఫ్యూచర్ సిటీలకు సంబంధించి గ్రీన్‌ఫీల్డ్ రహదారి (రతన్ టాటా రోడ్డు) నిర్మాణం మొదలు కానుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పనుల కోసం హెచ్ఎండీఏ మంగళవారం టెండర్లను ఆహ్వానించింది. రెండు ప్యాకేజీల్లో ఈ రహదారి నిర్మాణం పనులు పూర్తి చేయనున్నారు.
కొలిక్కి వచ్చిన భూ సేకరణ :ప్రస్తుతం అవుటర్ రింగ్ రోడ్డుని రావిర్యాల ఇంటర్‌ఛేంజ్ 13 నుంచి ఆమన్‌గల్ రీజినల్ రింగ్ రోడ్డు అనుసంధానంగా మొత్తం 41.50 కిలోమీటర్ల పొడవుతో ఈ గ్రీన్‌ఫీల్డ్ రహదారిని నిర్మించనున్నారు. ఇప్పటికే భూ సేకరణ ప్రక్రియ కూడా కొలిక్కి వచ్చింది. దీంతో పనులు చేపట్టేందుకు హెచ్ఎండీఏ సమాయత్తమవుతోంది. తొలి దసలో రావిల్యాల్ ఇంటర్ ఛేంజ్ నుంచి మీర్‌ఖాన్‌పేట్ వరకు 19.2 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు.
మార్చి 21న సాంకేతిక బిడ్లు :రెండో దశలో మీర్‌ఖాన్‌పేట్ నుంచి ఆమన్‌గల్ వరకు 22.30 కిలోమీటర్ల మేర అందుబాటులోకి రానుంది. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, యాచారం, కడ్తాల్, ఆమన్‌గల్ మండలాలు, 14 గ్రామాలను కలుపుతూ ఈ రహదారి అందుబాటులోకి రానుంది. టెండర్ పత్రాలు ఈ నెల 28 నుంచి సమర్పించాలని, మార్చి 21న సాంకేతిక బిడ్లు తెరవనున్నట్లు హెచ్ఎండీఏ తెలిపింది.
- మొత్తం గ్రీన్‌ఫీల్డ్ రహదారి పొడవు- 41.5 కిలోమీటర్లు
- తొలి దశ- 19.2 కి.మీ(ఓఆర్‌ఆర్ రావిర్యాల నుంచి మీర్‌ఖాన్‌పేట్ వరకు)
- మొత్తం వ్యయం- రూ.1,665 కోట్లు
- రెండో దశ- 22.30 కి.మీ(మీర్‌ఖాన్‌పేట నుంచి రీజనల్ రింగ్ రోడ్డు ఆమన్‌గల్ వరకు)
- మొత్తం వ్యయం- రూ.2,365 కోట్లు
- వెడల్పు- 100 మీటర్లు (యాక్సెస్ కంట్రోల్ ఎక్స్‌ప్రెస్ వే) నిర్మాణం
- ఆరు లైన్ల మెయిన్ క్యారేజ్ వే భవిష్యత్తులో 8 లైన్లుగా విస్తరణకు వెసులుబాటుగా భూసేకరణ
- మెట్రో/రైల్వే కారిడార్ కోసం అటు ఇటు 20 మీటర్ల వెడల్పుతో భూమి రిజర్వు.పచ్చదనం కోసం 2 మీటర్ల వెడల్పుతో సెంట్రల్ మీడియన్
- ఇరువైపులా గ్రీన్‌బెల్ట్, సైకిల్ ట్రాక్, యుటిలిటీ కారిడార్ నిర్మించనున్నారు.