Telangana Rythu Bandhu Scheme Funds Released: రైతులు గత కొంత కాలంగా రైతుబంధు డబ్బులు కోసం ఎదురు చూస్తున్న వారి నిరీక్షణ ఫలించింది. యాసంగి సీజన్‌కు సంబంధించిన నగదును రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఐదు ఎకరాలకు పైగా ఉన్న అన్నదాతలకు కూడా ఈ నిధులు చెల్లిస్తోంది. ఈ నిధులు ఆర్థికశాఖ ద్వారా బ్యాంకులకు చేరగా సోమవారం నుంచే నేరుగా ఎకరాకు రూ.5 వేలు చొప్పున కర్షకులు ఖాతాలో జమ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Rythu Bandhu Funds For 5 Acres Land Owners : రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున దీనిపై అధికార ప్రకటన విడుదల చేయలేదు. మార్చి 28కి ప్రభుత్వం 64,75,320 మంది రైతుల ఖాతాల్లో రూ.5,575 కోట్ల రైతుబంధు డబ్బులను వేసింది. తాజాగా మిగిలిన రైతులకు నిధులు విడుదల చేపట్టింది. ఇంతవరకు మొత్తం 1,11,39,534 ఎకరాలకు సాయం అందింది. తెలంగాణలో ఐదు ఎకరాలు కంటే ఎక్కువ భూమి కలిగిన రైతులు 5.50 లక్షల మంది ఉన్నారు. ఇందులో 5 నుంచి 10 ఎకరాల వరకు ఉన్నవారు 4.4 లక్షలు, 10-24 ఎకరాలు ఉన్నవారు 94,000. 25 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నవారు 6,488 మంది ఉన్నారు.
నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు: ప్రస్తుతం రైతుల ఖాతాలో డబ్బులు వేసేందుకు రూ.2 వేల కోట్ల మేరకు అవసరమని అధికారులు అంచనా వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటిలో 5 ఎకరాల మేరకు సాయం అందించాలని భావించింది. మిగిలిన రైతులు కూడా సాయం కావాలని ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం తాజాగా వారికి కూడా నిధులు ఇవ్వాలని నిర్ణయించింది. అనంతరం ఆర్థికశాఖకు ఆదేశించింది. ఈ మేరకు బ్యాంకులు రైతుల ఖాతాల్లో నిధులను జమ చేస్తున్నట్లు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చివరిసారిగా 2023లోని ఆగస్టులో వానాకాలం సీజన్‌కు మొత్తం 1,52,49,486.39 ఎకరాలకు 68,99,976 మంది రైతులకు రూ.7,624.74 కోట్లు విడుదల చేసింది.