Telangana government rejects Rs 100 crore Adani donation :అదానీ గ్రూప్‌పై లంచాల విమర్శల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీకి ఇటీవల అదానీ గ్రూప్ ప్రకటించిన రూ.100 కోట్ల విరాళాన్ని స్వీకరించరాదని ఈ మేరకు నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్మీట్లో వెల్లడించారు. ఆ గ్రూప్‌పై విమర్శల నేపథ్యంలో అదానీ ఫౌండేషన్ నుంచి విరాళాన్ని తీసుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆ అదానీ గ్రూపునకు లెటర్‌ను పంపినట్లుగా సీఎం వెల్లడించారు.
అనవసర వివాదాల్లోకి ప్రభుత్వాన్ని లాగొద్దు :'అదానీ విషయంలో గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. అదానీ నుంచి తెలంగాణ ప్రభుత్వం నిధులను స్వీకరించిందని కొందరు విమర్శిస్తున్నారు. రాజ్యాంగ బద్ధంగా, చట్టబద్ధంగానే అదానీ నుంచి పెట్టుబడులను అనుమతిస్తాం. నియమ నిబంధనల మేరకే టెండర్లు పిలిచి ప్రాజెక్టులు ఇస్తున్నాం. దేశంలో ఏ సంస్థలకైనా చట్టబద్ధంగా బిజినెస్ చేసుకొనే హక్కు ఉంటుంది. అంబానీ, అదానీ, టాటా ఎవరికైనా తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారం చేసుకొనే హక్కు ఉంది' అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
గొప్ప సంకల్పంతో లక్షలాది మంది నిరుద్యోగులకు టెక్నికల్ స్కిల్స్ నేర్పించే లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గొప్ప సదుద్దేశంతో ప్రారంభించిన ఈ స్కిల్ వర్సిటీ వివాదాలకు లోను కావడం మంత్రివర్గ సహచరులకు, నాకు(సీఎం రేవంత్), ప్రభుత్వానికి ఇష్టంలేదని వివరించారు. అదానీ గ్రూప్ స్కిల్స్ వర్సిటీకి ఇచ్చిన విరాళాన్ని సీఎం, మంత్రులకు ఇచ్చినట్లుగా కొందరు ప్రచారం చేస్తున్నారన్నారు. సీఎస్‌ఆర్(కార్పొరేట్ సామాజిక బాధ్యత) కింద స్కిల్స్ వర్సిటీకి అదానీ గ్రూప్ ప్రకటించినటువంటి రూ.100 కోట్లు బదిలీ చేయొద్దని కోరుతూ ఆ గ్రూప్‌నకు లేఖ పంపామని పేర్కొన్నారు. అనవసర వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని లాగొద్దని కోరారు. తెలంగాణ ప్రభుత్వ అకౌంట్లోకి ఎవరి నుంచీ డబ్బులు రాలేదని రేవంత్ రెడ్డి అన్నారు.