Telangana Government on Cellars in Building :బహుళ అంతస్తుల్లో వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాటు చేసే సెల్లార్ల నిర్మాణాలకు స్వస్తి పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. సెల్లార్లపై ఫిర్యాదులు వస్తుండటంతో పాటు వర్షపు నీరు చేరి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భారీ వర్షాల సమయంలోనూ మోటార్లతో సెల్లార్లలో నిలిచిన నీటిని తోడాల్సి వస్తోంది. చాలా లోతు తవ్వకాలతో వచ్చే మట్టితోనూ సమస్యగా ఉంది. ఇళ్ల నిర్మాణ ఖర్చు పెరుగుదలకు కారణమవుతోంది. బహుళ అంతస్తుల నిర్మాణాల్లో ప్రస్తుతం ఐదారు సెల్లార్ల వరకు అనుమతిస్తున్నారు. హైదరాబాద్‌లో భూకంప ప్రభావిత ప్రాంతాల (సెసిమిక్ జోన్స్)ను సర్కార్ గతంలో గుర్తించింది.
అక్కడ సెల్లార్ల నిర్మాణాలు చాలా ప్రమాదకరమని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు సెల్లార్లనే అనుమతించకపోతే వీటన్నింటికీ పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశంలో చట్టబద్ధత తీసుకొచ్చి, పురపాలక చట్టంలోని భవన నిర్మాణ అనుమతుల నిబంధనలను సవరించనున్నట్లు ఓ ఉన్నతాధికారి చెప్పారు. భవనాల్లో పార్కింగ్‌కు సెల్లార్ల స్థానంలో స్టిల్ట్‌లను (భూమి నుంచే పార్కింగ్ కోసం నిర్మాణం చేపట్టడం) చేపట్టాలని అధికారులు డిజైన్‌లో సవరణలు చేస్తున్నారు. ఎన్ని అంతస్తులైనా స్టిల్ట్ నిర్మాణాలకు అనుమతులివ్వొచ్చని వివరిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాణ ఎత్తులో వెసులుబాటు కల్పించాలని నిర్ణయించారు.
'ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో సెల్లార్ల స్థానంలో స్టిల్ట్ నిర్మాణాలకు అనుమతి ఇచ్చాం. రెండు నుంచి మూడు స్టిల్లుల వరకు అనుమతిస్తున్నాం. ఇళ్ల నిర్మాణదారుల నుంచి సానుకూలత వస్తోంది. కానీ వాణిజ్య భవనాల నిర్మాణదారులు వీటిపై ఆసక్తి చూపటం లేదు'- అధికారులు