HYDRA Procedures in Hyderabad : రాజధాని ప్రజలను విపత్తుల నుంచి రక్షించేందుకు ప్రభుత్వ ఆస్తుల రక్షణ, నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన వ్యవస్థను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పేరుతో స్వతంత్ర వ్యవస్థకు రూపకల్పన చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సంస్థ నిర్మాణం, బాధ్యతలు, విధి విధానాలతో కూడిన జీవో 99ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి విడుదల చేశారు.
హైదరాబాద్‌కు రక్షణ కవచంగా హైడ్రా : జీహెచ్ఎంసీ పరిధితో పాటు శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీల పరిధిలోని 2 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హైడ్రా పని చేయనుంది. జాతీయ సగటు కన్నా అధికంగా తెలంగాణలో ఏటా 3.2 శాతం మేర పట్టణ జనాభా పెరుగుతోంది. అందులో హైదరాబాద్ వాటా అధికంగా ఉన్న నేపథ్యంలో వేగంగా అభివృద్ధి చెందుతోన్న హైదరాబాద్‌కు రక్షణ కవచంగా ఉండాలనే ఉద్దేశంతో హైడ్రాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఒకే వేదిక ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందుతాయని ప్రభుత్వం ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేసింది. ఇటీవలె రాష్ట్ర ప్రభుత్వం ఐజీ ర్యాంకులోని ఐపీఎస్ అధికారి రంగనాథ్‌ను జీహెచ్ఎంసీలోని ఈవీడీఎం డైరెక్టర్‌గా నియమించింది. ఇప్పుడు హైడ్రాకు ఆయనే కమిషనర్‌గా విధులు నిర్వర్తించనున్నారు. అలాగే జీహెచ్ఎంసీకి చెందిన విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు బల్దియాలో గతంలో మాదిరిగానే కొనసాగనున్నాయి.
రక్షణ చర్యలు చేపటడ్డం హైడ్రా బాధ్యత : జీహెచ్ఎంసీతో పాటు రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని ఇతర ప్రాంతాలకు విపత్తుల రక్షణ కల్పించే విషయమై సమగ్ర ప్రణాళికను హైడ్రా రూపొందించాలి. రాష్ట్ర, ఇతర రాష్ట్రాలు, జాతీయ స్థాయి విపత్తు స్పందన బృందాలు, వాతావరణ శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీలను సమన్వయం చేసుకుంటూ వాతావరణ సమాచారాన్ని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు రక్షణ చర్యలు చేపటడ్డం హైడ్రా బాధ్యత. అలాగే జీహెచ్ఎంసీ, స్థానిక సంస్థల పరిధిలోని పార్కులు, లేఅవుట్లు ఖాళీ స్థలాలు, పరిశ్రమల శాఖ స్థలాలు, జలవనరుల ఆక్రమణలపై ఫిర్యాదులను స్వీకరిస్తూ విచారణ చేపట్టడం, ఆక్రమణలను అడ్డుకోవడం, చెరువులను కబ్జాల నుంచి రక్షించడం వంటి బాధ్యతలను హైడ్రా చేయాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో జిల్లా కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్, పోలీసు కమిషనర్లు, ఇతర శాఖల అధికారులు హైడ్రాకు సహకారం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. భవన నిర్మాణ అనుమతులు, నిబంధనల ఉల్లంఘన, శిథిల భవనాలు, పౌరుల భద్రతకు సంబంధించిన పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్తులను పరిశీలించే అధికారం ఈ విభాగానికి ఉంటుంది. అలాగే నియమ నిబంధనల ప్రకారం అనధికార ప్రకటనలు, అక్రమ నిర్మాణాలపై న్యాయపరమైన చర్యలు తీసుకోవచ్చు.