Telangana Govt Released Second Installment Crop Loan Funds :అసెంబ్లీ ప్రాంగణంలో రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం జరిగింది. రెండో విడత రైతు రుణమాఫీ నిధులు సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. రెండో విడత రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు రుణమాఫీ కానుంది. రెండో విడతలో 6.4 లక్షల మంది రైతులకు రూ.6,190 కోట్లు జమ చేశారు. తొలివిడతలో 11.34 లక్షల మంది రైతులకు రూ.6,035 కోట్లు విడుదల చేయగా రుణమాఫీ ద్వారా ఇప్పటివరకు 17.75 లక్షలమంది రైతులకు లబ్ధి చేకూరింది. రెండు దశల్లో కలిపి రైతుల ఖాతాల్లో రూ.12,225 కోట్లు ప్రభుత్వం జమ చేసింది.
ఇలాంటి కార్యక్రమం దేశంలో ఎక్కడా జరగలేదు :రైతులకు రెండోవిడత రుణమాఫీ చేయడం సంతోషంగా ఉందని మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రెండోవిడత రుణమాఫీ లబ్ధిదారులకు అభినందనలు తెలిపారు. రైతుల మేలు కోసం మా ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందన్న ఆయన రైతు రుణమాఫీపై శరవేగంగా నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు.
రెండో విడతలో 6.4 లక్షల మంది ఖాతాల్లో రూ.6,190 కోట్లు జమ చేశామని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ హామీ ఇచ్చినప్పుడు అందరూ అనుమానం వ్యక్తం చేసారని గుర్తు చేసిన ఆయన వరంగల్ సభలో రాహుల్ ఇచ్చిన హామీని నిజం చేశామని చెప్పారు. రాష్ట్రంలోని రైతులందరికీ ఇవాళ పండుగ రోజు అన్న ఆయన ఇలాంటి కార్యక్రమం గతంలో మనదేశంలో ఎక్కడా జరగలేదని మంత్రి భట్టి విక్రమార్క అన్నారు.