Telangana Government Focus on Crop Insurance : రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం కానుక అందించబోతోంది. త్వరలో కొత్త వ్యవసాయ పంట బీమా పథకం అమల్లోకి రానుంది. ఖరీఫ్ సీజన్ నుంచి ఉచిత పంట బీమా పథకం అమల్లోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఆ దిశగా విస్తృత కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులు విధివిధానాల రూపకల్పనలో నిమగ్నమయ్యారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరడం, ప్రీమియం చెల్లింపులు, బీమా పరిహారం వంటి అంశాలపై అధ్యయనం చేస్తున్నారు.
పొరుగు రాష్ట్రాల్లో పంట బీమా పథకం ఎలా అమలవుతోందని పరిశీలిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన బీమా కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా ఉందని, రైతులకు ఉపయోగకరంగా లేదని గత ప్రభుత్వం మూడేళ్ల క్రితం దాన్ని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో విపత్తులు సంభవిస్తే అన్నదాతలు నష్టపోతున్నందున ఖరీఫ్ సీజన్ నుంచి కొత్త బీమా పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీనికి ఏటా రూ.3వేల కోట్ల వ్యయం కావచ్చని అంచనా.
Crop insurance scheme in Telangana : నూతనంగా అమలు చేయనున్న పంటల బీమా పథకంలో రైతులు నయా పైసా చెల్లించాల్సిన అవసరం లేదు. రైతుల తరపున రాష్ట్ర ప్రభుత్వమే వ్యవసాయ పంటలకు ప్రీమియం చెల్లిస్తుంది. ఇది ఈ పథకం ప్రత్యేకత. ప్రకృతి విపత్తులతో పంటలు నష్టపోతే బీమా కంపెనీల నుంచి పరిహారం వచ్చేలా ప్రభుత్వం నిక్కచ్చి చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రవ్యాప్తంగా కోటిన్నర ఎకరాల విస్తీర్ణం వ్యవసాయ భూమి ఉంది. ఇందులో మొత్తం సాగవటం లేదు. 2021-22 ఖరీఫ్ సీజన్‌లో 1,30 కోట్ల ఎకరాలు, 2022-23లో 1.36 కోట్ల ఎకరాలు, 2023-24లో 1.26 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ పంటలు సాగయ్యాయి. ఈ లెక్కన వచ్చే ఖరీఫ్‌లోనూ 1.30 నుంచి 1.35 కోట్ల ఎకరాలు పైగా పంటల బీమా ప్రీమియం నేరుగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఐతే రైతులు, రైతు సంఘాలతో విస్తృతంగా చర్చించిన మీదట అన్నదాతకు ఏ విధంగా న్యాయం జరుగుతుందో నిర్థారణకొచ్చాకే విధానం రూపొందించాలని నిపుణులు అన్నారు.
New Agricultural Crop Insurance Scheme: పంటల కొత్త బీమా పథకం అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు బీమా కంపెనీలతో ఒప్పందాలు, ప్రీమియం నిర్ధారణకు ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ ద్వారా చేపట్టే క్రాప్ బుకింగ్ యాప్‌లో నమోదైతే చాలు ఆ పంటలకు బీమా వర్తిస్తుంది. సుమారు 1.35 కోట్ల ఎకరాల నుంచి 1.45 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో వానా కాలం పంటలు సాగయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మొత్తం విస్తీర్ణానికి పంటల బీమా పథకం అమలు చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం మెరుగ్గా అమలు చేసేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా అధికారులు సదస్సులు నిర్వహిస్తున్నారు. ఏఈఓల స్థాయి నుంచి ఏఓఏలు, ఏడీఏలు, డీఏఓలు, సీపీఓలు, ఇతర అనుబంధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ సదస్సులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని అన్నదాతల పక్షాన స్వాగతిస్తున్నామని రైతు సంఘాలు నేతలు తెలిపారు.