Govt Focus On LRS One Time Settlement :అనధికార లే అవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు తెచ్చిన ఎల్.ఆర్.ఎస్. (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్)ను మరింత పకడ్బందీగా అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. రిజిస్ట్రార్లు, మున్సిపల్ అధికారులు కుమ్మక్కై, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు సంబంధించిన స్థలాలకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేస్తుండటాన్ని లోతుగా అధ్యయనం చేయించిన ప్రభుత్వం, మొత్తం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ఒకేసారి పరిష్కరించడానికి వన్ టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్)ను అమలు చేయాలని నిర్ణయించినట్లుగా తెలిసింది.
25శాతం రాయితీ ఇచ్చి ఓటీఎస్ :బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి వద్ద జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి, రెవెన్యూ, పురపాలక, రిజిస్ట్రేషన్ల శాఖల ముఖ్య కార్యదర్శులు నవీన్‌మిత్తల్, దానకిశోర్, జ్యోతి బుద్ధప్రకాశ్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ దేవేందర్‌రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2020లో ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్న మొత్తంలో నుంచి 25 శాతం రాయితీ ఇచ్చి ఓటీఎస్ అమలు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నట్లుగా సమాచారం.
పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి :ఎఫ్.టి.ఎల్.(ఫుల్ ట్యాంకు లెవల్) పరిధిలో ఉన్నవి మినహా మిగిలిన వాటికి ఓటీఎస్‌ను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు త్వరలోనే వెలువడనున్నట్లుగా సమాచారం. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం 2020 ఆగస్టులో ఎల్.ఆర్.ఎస్.ను(లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) తెరపైకి తేగా అప్పటి నుంచి అమలు తీరుపై చర్చ జరిగింది. అప్పట్లో 25 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని వచ్చాయి. మొత్తం ఏడెనిమిది లక్షల దరఖాస్తులు మినహా మిగిలినవన్నీ పెండింగ్‌లో ఉన్నట్లుగా తెలిసింది.