Telangana Government on Flood prone Areas :హైదరాబాద్‌లో ప్రధాన రహదారులపై నిలిచే వరదనీటి నుంచి నగరవాసులు, వాహనదారుల కష్టాలను గట్టెక్కించేందుకు చేపట్టిన భూగర్భ సంపుల నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ శరవేగంగా పూర్తి చేస్తోంది. 6 జోన్లలో ఒక్కో జోన్‌కు 5 చొప్పున నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా ప్రాథమికంగా అత్యంత సమస్యాత్మకంగా ఉన్న 14 ప్రాంతాల్లో భూగర్భ సంపుల నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూ. 20 కోట్లు కేటాయించగా 10 లక్షల నుంచి 40 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. తద్వారా ఆయా ప్రాంతాల్లోని వరద నీటిని సంపుల్లోకి మళ్లించి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూసేందుకు పనులు చేస్తున్నారు.
ఖైరతాబాద్ జోన్‌పరిధిలో సచివాలయం ఎదురుగా 30 లక్షల లీటర్ల సామర్థ్యంతో భూగర్భ సంపును నిర్మించారు. 150 అడుగుల లోతులో 4 ఇంజక్షన్ బోర్‌వెల్స్ వేసి వరదనీటిని మళ్లించనున్నారు. దాదాపు ఆ పనులు పూర్తికాగా సంపు చుట్టూ గ్రిల్స్ బిగిస్తున్నారు. ప్రధాన రహదారి కావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఇప్పటికే అక్కడ మట్టిని తొలగించి తారురోడ్డు వేశారు. ప్రయాణ ప్రాంగణానికి వచ్చేవారికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. రాజ్‌భవన్‌రోడ్డులోని లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ వద్ద 13 లక్షల లీటర్ల సామర్థ్యంతో రెండు, ఆర్టీఏ కార్యాలయం ఎదురుగా ప్రధాన రహదారిపై 10 లక్షల లీటర్ల సామర్థ్యంతో మరో సంపు నిర్మించారు.