DIL RAJU COMMENTS ON KTR: కేటీఆర్‌పై ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఇటీవల జరిగిన సినీ ప్రముఖుల భేటీపై కేటీఆర్ వ్యాఖ్యలు బాధాకరమని దిల్‌రాజు అన్నారు. చిత్ర పరిశ్రమను వివాదాల్లోకి లాగొద్దని ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు కోరారు.
తెలుగు చిత్ర పరిశ్రమను అనవసర వివాదాల్లోకి లాగొద్దని, రాజకీయాలను ఆపాదించొద్దని అన్నారు. రాజకీయ దాడి, ప్రతిదాడులకు పరిశ్రమను వాడుకోవద్దన్న దిల్ రాజు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ పరిశ్రమ భేటీ చాటుమాటు వ్యవహారం కాదని పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమ బాగోగులపై స్నేహపూర్వక చర్చ జరిగిందని వెల్లడించారు. తెలంగాణ సీఎంతో భేటీపై చిత్ర పరిశ్రమ సంతృప్తిగా ఉందని దిల్ రాజు తెలిపారు.
KTR Comments on Allu Arjun: కాగా హీరో అల్లు అర్జున్ వ్యవహారంపై తెలంగాణ మాజీమంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మరోసారి స్పందించిన విషయం తెలిసిందే. కేవలం ప్రచారం కోసమే సినిమా వాళ్ల గురించి సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారని కేటీఆర్ ఆరోపించారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించారంటూ ధ్వజమెత్తారు.
అటెన్షన్, డైవర్షన్ కోసమే సీఎం రేవంత్‌రెడ్డి పాకులాడుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మంగళవారం ఉదయం మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ వ్యవహారంపై కేటీఆర్ స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి సినిమా వాళ్లతో సెటిల్మెంట్ చేసుకుని ఇప్పుడు ఏం మాట్లాడట్లేదని ఆరోపించారు.