Telangana Fake Passport Case Update : నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి అనర్హులకు పాస్‌పోర్టులు జారీ చేసిన కుంభకోణంలో అరెస్టుల సంఖ్య 14కు చేరింది. ఇటీవల నిజామాబాద్‌కు చెందిన ఎస్‌బీ ఏఎస్సై లక్ష్మణ్‌ను, భీంగల్‌కు చెందిన ఏజెంట్‌ను ముంబయిలో సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. తాజాగా ఆదిలాబాద్‌లోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో పోస్టల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ప్రణబ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
వారి నుంచి సీఐడీ అధికారులు పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా వ్యవహారంతో సంబంధం ఉన్న వారిని సీఐడీ గుర్తిస్తోంది. కాగా నకిలీ డాక్యుమెంట్లతో(Fake Documents ) ఇప్పటి వరకూ 95 మంది శ్రీలంకకు చెందిన వారికి పాస్‌పోర్టుల జారీ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. వీరంతా అక్రమ వలసలు వచ్చిన వారిగా తేల్చారు. ఈ వివరాలను పాస్‌పోర్ట్, ఇమిగ్రేషన్ అధికారులకు అందించారు.
CID Arrested Fake Passport Gang :కేసు దర్యాప్తులో భాగంగా నమోదు చేసిన సీఐడీ అధికారులు ఈనెల 19న రాష్ట్రంలో పలు చోట్ల సోదాలు చేశారు. హైదరాబాద్, జగిత్యాల, కోరుట్ల, నిజామాబాద్, కరీంనగర్లో సోదాలు చేసి 11 మంది అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అబ్దుస్ సత్తార్ చెన్నైలో ఉన్న ఏజెంట్ సాయంతో శ్రీలంక (Sri Lanka) నుంచి వలస వచ్చిన శరణార్థులకు హైదరబాద్ నుంచి నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి, పాస్‌పోర్టులు జారీ చేసినట్లు గుర్తించారు. ఇందుకు తన ముఠాతో పాటు అప్రూవ్(Approve) చేయాల్సిన ఎస్‌బీ అధికారులకు లంచాలు ముట్టజెప్పినట్లు దర్యాప్తులో తేలింది.