Deputy CM Bhatti On Loan Waiver in Telangana: ఆగస్టు 15వ తేదీ లోపు రాష్ట్రంలోని 40లక్షల బ్యాంకు ఖాతాల ద్వారా 31వేల కోట్లు రైతు రుణమాఫీ కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇవాళ ప్రజాభవన్‌లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో సమావేశమైన ఆయన రైతు రుణమాఫీపై చర్చించారు. రుణమాఫీ సకాలంలో ఇబ్బందులు ఎదురు కాకుండా బ్యాంకులు పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న భట్టి విక్రమార్క ప్రభుత్వం విడుదల చేసే రైతు రుణమాఫీ నిధులను వాటికి మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు.
'ఇతర అప్పులకు జమ చేసి రైతులను ఇబ్బంది పెట్టొద్దు. గురువారం సాయంత్రం 4గంటలకు 11లక్షల పైబడి రైతులకు రూ.6000 కోట్ల పైబడి నిధులు వారి ఖాతాల్లో జమ చేస్తాం. ఈ నెలలోనే రెండోదఫా లక్షన్నర వరకు రుణాలు తీసుకున్న రైతుల రుణాలకు నిధులు విడుదల చేస్తాం. ఆ తర్వాత 2లక్షల వరకు రుణమాఫీ నిధులిస్తాం. రెండు లక్షలపైన రుణం ఉన్న రైతులతో బ్యాంకర్లు మాట్లాడి మిగిలిన మొత్తాన్ని రికవరీ చేసుకోవాలి.' అని భట్టి సూచించారు.
Telangana Rythu Runa Mafi :ప్రభుత్వం మంజూరు చేసే రెండు లక్షలు కలుపుకొని మొత్తంగా ఏ రైతు రుణం బకాయి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భట్టి విక్రమార్క తెలిపారు. రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనే చారిత్రాత్మక నిర్ణయమన్న ఆయన ఒకేసారి 2 లక్షల రుణమాఫీ పథకం ద్వారా 31వేల కోట్లు ఏ రాష్ట్రంలో మాఫీ చేయలేదని చెప్పారు. అధికారంలోకి వచ్చే ముందు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేతగా తాను రైతు రుణమాఫీ గ్యారెంటీ కార్డుపై సంతకం చేసి ప్రచారంలోకి వెళ్లామని పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని తు.చ. తప్పకుండా రైతు రుణమాఫీని అమలు చేసి చూపిస్తున్నామని చెప్పారు.