Telangana Decade Celebrations Arrangements 2024 : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ వేదికగా ఆదివారం ఉదయం, సాయంత్రం ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు గన్ పార్కులో అమర వీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాళులు అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరగనున్న ముఖ్యమంత్రి హాజరై జాతీయ జెండా ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసు బలగాల పరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమాలు ఉంటాయి. అదే వేదికపై "జయ జయహే తెలంగాణ" రాష్ట్ర అధికార గీతాన్ని జాతికి అంకితం చేస్తారు. అనంతరం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందికి, ఉత్తమ శకటాలకు అవార్డులను ప్రదానం చేసి ఫోటో సెషన్‌లో పాల్గొంటారు.
Telangana Formation Day 2024 : ఆదివారం సాయంత్రం ట్యాంక్ బండ్‌పై ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ హస్తకళలు, ఉత్పత్తులు, ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. సాయంత్రం ఆరున్నరకు సీఎం రేవంత్‌రెడ్డి ట్యాంక్‌బండ్‌కు చేరుకొని అక్కడి స్టాళ్లను సందర్శిస్తారు. సుమారు 700 మంది కళాకారులతో తెలంగాణ కళారూపాల కార్నివాల్ నిర్వహిస్తారు. అనంతరం 70 నిమిషాల పాటు సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలు ఉంటాయి. ఆ తర్వాత సుమారు 5వేల మంది జాతీయ జెండాలతో ట్యాంక్‌బండ్‌పై భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. ఫ్లాగ్ వాక్ జరుగుతుండగా పదమూడున్నర నిమిషాల "జయ జయహే తెలంగాణ" పూర్తి నిడివి గీతాన్ని విడుదల చేస్తారు. కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని వేడుకల్లో ప్రభుత్వం సన్మానించనుంది. రాత్రి 8 గంటల 50 నిమిషాల నుంచి పది నిమిషాల పాటు హుస్సేన్ సాగరం మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా బాణాసంచా కార్యక్రమం నిర్వహిస్తారు.
మూడు రోజుల పాటు తెలంగాణ దశాబ్ది వేడుకలు నిర్వహించనున్న బీఆర్ఎస్ - BRS Formation Day Celebrations