Telangana Congress PEC Meeting Today : పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం గెలుపు గుర్రాల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది నియోజకవర్గాల వారీగా ఆశావహుల నుంచి ఇప్పటికే దరఖాస్తులను స్వీకరించగా రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు మొత్తం 309 మంది నాయకులు అర్జీ పెట్టుకున్నారు. ఇందులో పార్టీ నాయకులతో పాటు అధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. కొంతమంది అధికారులుగా కొనసాగుతూనే ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా మరికొందరు పదవీ విరమణ పొందిన అధికారులు సైతం అర్జీ పెట్టుకున్నారు.
Congress MP Tickets Applications 2024 : పదిహేడు నియోజకవర్గాలకు సగటున ఒక్కో స్థానానికి 18 మందికి పైగా కాంగ్రెస్‌లో టికెట్ కోసం పోటీపడుతున్నారు. ఇందులో అత్యధికంగా ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానమైన మహబూబాబాద్ నుంచి 47 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వరంగల్ టికెట్ కోసం 40 మంది, పెద్దపల్లిలో 29 మంది, భువనగిరి నుంచి 28 మంది అర్జీ పెట్టుకున్నారు. అతి తక్కువ దరఖాస్తులు వచ్చిన నియోజకవర్గాల్లో మహబూబ్‌నగర్ టికెట్ కోసం కేవలం నలుగురు మాత్రమే ముందుకు రాగా జహీరాబాద్ నుంచి ఆరుగురు మాత్రమే దరఖాస్తు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
లోక్‌సభ బరిలో కొత్త అభ్యర్థులు - మల్కాజిగిరి స్థానం నుంచి బడా వ్యాపారవేత్త!
Congress Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించగా ప్రధానంగా సికింద్రాబాద్ నుంచి కోదండరెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, ఫిరోజ్‌ఖాన్, చార్టెడ్ అకౌంటెంట్ వేణుగోపాలస్వామి దరఖాస్తు చేసుకున్నారు. నల్గొండ నుంచి పటేల్ రమేష్ రెడ్డి, రఘువీర్‌రెడ్డి, సర్వోత్తమరెడ్డి, భువనగిరి నుంచి చామల కిరణ్‌రెడ్డి, బండ్రు శోభారాణి, డాక్టర్ సూర్య పవన్‌రెడ్డి, కైలాస్ నేత టికెట్‌కు అర్జీ పెట్టుకున్నారు. నాగర్‌కర్నూల్ నుంచి మల్లు రవి, మందా జగన్నాథం, చారకొండ వెంకటేష్, సంపత్‌కుమార్, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, ఎ.చంద్రశేఖర్, పెరికి శ్యాం, మెదక్ నుంచి ఎం.భవానీరెడ్డి, బండారు శ్రీకాంత్, చెరుకు శ్రీనివాస్‌రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు.