Congress Focus On New PCC Chief in Telangana :ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డినే ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ నెల 27 నాటికి ఆయన గడువు ముగియనుండటం సహా కొత్త అధ్యక్షుడి ఎంపికపై ఏఐసీసీ కసరత్తు మొదలుపెట్టడంతో ఆ పదవి కోసం రాష్ట్ర నేతలు లాబీయింగ్ చేస్తున్నారు. పీసీసీ అధ్యక్ష పదవి కోసం దాదాపు 12 మంది పోటీ పడుతున్నారు. మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ సహా పలువురు నేతలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఎంపీ, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ దిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌తో నేరుగా పరిచయాలు ఉండటంతో తనకే అవకాశమివ్వాలని కోరుతున్నట్లు సమాచారం.
రాహుల్ మంతనాలు : పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న జగ్గారెడ్డి వారం రోజులుగా దిల్లీలోనే మకాం వేసి తనవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సీనియర్ నాయకుడిగా, పార్టీ విధేయుడిగా జగ్గారెడ్డికి రాహుల్ వద్ద మంచి పేరుంది. మాజీ ఎంపీ, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ అవకాశమివ్వాలంటూ సీఎం రేవంత్ సహా ఏఐసీసీతోనూ మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ కార్యదర్శిగా, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది.
కొత్త రథసారధి కోసం దాదాపు 12 మంది ప్రయత్నాలు చేసుకుంటున్నా, సామాజిక సమతుల్యత పాటించి పార్టీ అధిష్ఠానం ముందుకెళ్లాల్సి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. సీఎంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ ఉండడంతో పీసీసీ అధ్యక్షుడిగా ఆ సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం దాదాపు లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెడ్డియేతర సామాజిక వర్గాలకు పీసీసీ అధ్యక్ష పదవి దక్కే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. నెలాఖరు నాటికి పీసీసీ అధ్యక్ష పదవి గడువు ముగియనుండడంతో అంతలోపే ఆ ప్రక్రియ పూర్తి చేయాలని ఏఐసీసీ యోచిస్తున్నట్లు సమాచారం.
కొత్త పీసీసీ చీఫ్ కోసం కాంగ్రెస్ వేట - రేసులో కీలక నేతలు! - TELANGANA PCC NEW CHIEF 2024