CM Revanth Reaches Hyderabad :తెలంగాణ రాష్ట్రాభివృద్ధి, పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆగస్టు 3 నుంచి సాగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతమైంది. సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, అధికారుల బృందం ఉదయం 11 గంటలకి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. పలువురు ఎమ్మెల్యేలతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు విమానాశ్రయానికి చేరుకొని రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. మరోవైపు ముఖ్యమంత్రి బృందం అమెరికా పర్యటనపై విపక్షాలు చేస్తున్న విమర్శలను మంత్రి శ్రీధర్ బాబు తిప్పికొట్టారు.
రాష్ట్రానికి రూ.31,532 కోట్ల పెట్టుబడులు :తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చినందుకు రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలు ధన్యవాదాలు తెలిపారు. అమెరికాలోని న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్, శాన్ ఫ్రాన్సిస్కోలో పర్యటించిన సీఎం మొత్తంగా రూ.31,532 కోట్ల రూపాయల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చారు. ఈనెల 11న దక్షిణ కొరియా రాజధాని సీయోల్కు వెళ్లిన రేవంత్ రెడ్డి అక్కడ పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే అంశంపై వారితో చర్చించారు.
బీఆర్ఎస్పై మండిపడ్డ మంత్రి శ్రీధర్ బాబు :రేవంత్ రెడ్డి బృందం అమెరికా పర్యటనపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్న వేళ మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. తమ బృందం ఏ టార్గెట్తోనూ వెళ్లలేదని, రాష్ట్ర ప్రగతికి సంబంధించిన ఆలోచనలు పంచుకునేందుకు మాత్రమే వెళ్లినట్లు స్పష్టం చేశారు. కాగా పెద్దమొత్తంలో పెట్టుబడులు రావడం హర్షించదగ్గ పరిణామం అని ఆయన తెలిపారు. తమ పర్యటన విఫలమైందని బీఆర్ఎస్ ఎద్దేవా చేసిందని, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ భంగపడిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.