CM REVANTH REDDY ON YADADRI NAME CHANGE : అధికారం చేపట్టినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ, పరిపాలనలో దూసుకుపోతున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక మార్పునకు సిద్ధమయ్యారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మార్చాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇక నుంచి అన్ని రికార్డుల్లోనూ యాదాద్రి పేరుకి బదులుగా యాదగిరిగుట్టగానే వ్యవహారికంలోకి తీసుకురావాలని అధికారులకు స్పష్టం చేశారు.
యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధికి సంబంధించిన పెండింగ్లో ఉన్న భూ సేకరణను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, అందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. ఆలయం అభివృద్ధి పనులకు సంబంధించిన పూర్తి వివరాలను వారం రోజుల్లో ఇవ్వాలని, అదే విధంగా ప్రపోజల్స్తో రావాలంటూ రేవంత్ రెడ్డి సూచించారు. పెండింగ్ పనులు, ఇతర అంశాలపై పూర్తిస్థాయి రిపోర్ట్ అందించాలని అధికారులకు రేవంత్ స్పష్టం చేశారు.