Telangana Budget Sessions2024-25 : శాసనసభ బడ్జెట్ సమావేశాలను వచ్చేనెల రెండో వారంలో నిర్వహించడానికి రాష్ట్ర సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అందులో పొందుపర్చిన అంశాల ప్రాతిపదికన తెలంగాణ బడ్జెట్‌ను (Telangana Budget 2024) ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో కేంద్రం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.
Vote on Account Budget in Telangana 2024 :రాష్ట్రంలోనూ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలా? లేదా ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టాలా? (Vote on Account Budget ) అని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయిలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే పద్దులు, డిమాండ్లపై కూలంకషంగా చర్చ జరుగుతుంది. ఇందుకోసం శాసనసభ సమావేశాలను కనీసం రెండు వారాలైనా నిర్వహించాలి. ఒకవేళ ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెడితే సమావేశాలు 4-5 రోజులకు మించి ఉండకపోవచ్చని సమాచారం.
2024-2025 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కసరత్తు షురూ చేసిన ప్రభుత్వం
Telangana Budget 2024 :లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి రెండో వారం తర్వాత ఎప్పుడైనా విడుదల కావచ్చనే ప్రచారం జరుగుతుండడంతో, ఆలోపే రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దఫా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. వాస్తవ రాబడుల ఆధారంగానే వార్షికపద్దు రూపొందించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాలు ఇవ్వడంతో, ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నిశాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.