Telangana BJP Leaders Reactions On Hydra:రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు హైడ్రాను తెరపైకి తెచ్చింది. నగరంలోని చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములను కబ్జా చేసి నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. సినీ నటుడు నాగార్జున తమ్మిడి చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్‌ను నిర్మించారని గుర్తించిన హైడ్రా రెండు రోజుల కిందట ఆ అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది.
BJP MP Raghunandan Support To Hydra: ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడంతో రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సంభవిస్తున్నాయి. హైడ్రాను తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీ రాజకీయ ఆరోపణలు చేస్తున్నాయి. ఇదే అంశంపై రాష్ట్ర కమలదళంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైడ్రాను స్వాగతిస్తున్నామని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రకటించారు. కేటీఆర్, కవిత, హారీశ్ రావు అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని రఘునందన్ రావు ప్రభుత్వాన్ని కోరారు.
అవసరమైతే ప్రభుత్వానికి సహకారం చేస్తామని చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ హైడ్రాను వ్యతిరేకిస్తున్నామన్నారు. హైడ్రా అనేది హైడ్రామా అని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఈటల రాజేందర్ అన్నారు. హైడ్రా వెనక ఉన్న కుట్రలను బయటపెడతామని కూడా హెచ్చరించారు.
హైడ్రాపై బీజేపీలో గందరగోళ పరిస్థితి :హైడ్రాపై బీజేపీలో భిన్న స్వరాలు వినిపిస్తుంటే కాషాయ శ్రేణుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన హైడ్రాపై ఏ విధంగా ముందుకు వెళ్లాలి?, స్వాగతించాలా లేక వ్యతిరేకించాలా అనే వైఖరి తెలియకపోవడంతో సతమతమవుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల శ్రేణులు అయోమయంలో ఉన్నారు. హైడ్రాతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని అందుకే విభేదిసున్నట్లు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ పార్టీ శ్రేణులకు చెప్పినట్లు సమాచారం. పేద, మధ్య తరగతి ప్రజల పేరు చెప్పి కార్పొరేట్ శక్తులు, బడా రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతున్నారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
పాతబస్తీ నుంచే కూల్చివేతలు ప్రారంభించాలి :పార్టీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాత్రం అక్రమ నిర్మాణాల కూల్చివేతను పాతబస్తీ నుంచే ప్రారంభించాలని డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. సల్కం చెరువును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఓవైసీ భవనాలను కూల్చివేయాలని సవాల్ విసిరారు. మరో వైపు బీజేపీ మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్, రూరల్, రంగారెడ్డి అర్బన్, రూరల్ జిల్లా అధ్యక్షులు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమై హైడ్రాపై చర్చించారు. నగరంలోని చెరువులు, కుంటల స్వరూపం, విస్తీర్ణంకు సంబంధించి తమ వద్ద ఉన్న సమగ్ర సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తామని చెరువులు, కుంటలను పరిరక్షించాలని కోరుతున్నారు. హైడ్రాతో బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో నెలకొన్న హైడ్రామా ఎటువైపుకు దారితీస్తుందోనన్న చర్చ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో మౌనంగా ఉంటేనే ఉత్తమమనే భావనను పార్టీ శ్రేణులు వ్యక్త పరుస్తున్నాయి.
హైడ్రా పేరుతో సీఎం రేవంత్ హైడ్రామా చేస్తున్నారు : ఏలేటి మహేశ్వర్‌రెడ్డి - BJP Alleti Maheshwar Reddy On Hydra
రాష్ట్ర రాజకీయాల్లో 'హైడ్రా'మా - అక్రమ కట్టడాల కూల్చివేతపై మాటలయుద్దం - Hydra Political Heat in Telangana