Telangana Bonam to Vijayawada Kanakadurga :ఆషాఢమాసం రాకతో ప్రారంభమైన బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తుల మనోభీష్టాలను నెరవేర్చే బెజవాడ కనక దుర్గమ్మకు భక్తులు బోనాలు, సారె సమర్పించుకున్నారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ పూజలు చేశారు. తెలంగాణ ప్రజలు సైతం అమ్మవారికి బోనం సమర్పించే ఆనవాయితీని కొనసాగించారు.
బెజవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస శోభ నెలకొంది. పలు ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి పరిసరాలు కిటకిటలాడాయి. భక్తి శ్రద్ధలతో బోనం తయారు చేసిన భక్తులు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. విజయవాడలోని పలుప్రాంతాల నుంచి భారీ ఊరేగింపులతో, విభిన్న రకాల నృత్య ప్రదర్శనలు చేస్తూ ఇంద్రకీలాద్రికి తరలివెళ్లి బోనం, సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
శివమెత్తిన భాగ్యనగరం - గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం - GOLCONDA BONALU 2024
దుర్గమ్మకు తెలంగాణ రాష్ట్ర భక్తులు బంగారు బోనం సమర్పించారు. హైదరాబాద్ భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో బెజవాడకు తరలివచ్చిన భక్తులు. భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ఏటా ఆషాఢ మాసంలో దుర్గమ్మకు హైదరాబాద్ పాతబస్తీలోని మహంకాళీ అమ్మవారి దేవాలయాల కమిటీ ద్వారా బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. విజయవాడ బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి చేరుకొన్న జోగిని నిషా క్రాంతి సహా పలువురు మహిళలు అక్కడ కొలువైన అమ్మవారు సహా దేవతలకు పూజలు చేశారు. దుర్గగుడి ఈవో రామారావు సహా అధికారులు పూజల్లో పాల్గొన్నారు. అనంతరం బంగారు బోనాన్ని తయారు చేశారు.
అనంతరం తలపై బంగారు బోనం ఎత్తిన జోగిని నిషాక్రాంతి డప్పుశబ్దాలకు అనుగుణంగా నృత్యం చేశారు. అనంతరం జమ్మి దొడ్డి నుంచి సామూహికంగా భారీ ఊరేగింపు ప్రారంభమైంది. ఇందులో పోతురాజుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అమ్మవారి విభిన్న రకాల రూపాలతో సిద్ధమైన కళా రూపాలతో మేళతాళాలు, కోలాటాలు, బేతాళ నృత్యాలతో కొనసాగిన ఊరేగింపు ఇంద్రకీలాద్రి వరకు కొనసాగింది. అనంతరం అమ్మవారి గుడికి వెళ్లి భక్తి శ్రద్ధలతో బంగారు బోనం సమర్పించారు. వారికి దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించి, ప్రసాదాలను అందజేశారు. ఈ సంప్రదాయం 15 ఏళ్లుగా కొనసాగుతోంది. కార్యక్రమంలో బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల కమిటీ అధ్యక్షుడు గాజుల అంజయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఆదివారం నుంచే బోనాల సందడి- ఆషాఢ మాసంలోనే ఎందుకు జరుపుకుంటారో తెలుసా? - Bonalu 2024