Telangana and Andhra Pradesh agrees on KRMB Budget : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్వహణకు అవసరమైన నిధులను దశల వారీగా ఇచ్చేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. బోర్డుకు సంబంధించిన 2024-25 బడ్జెట్, రెండు రాష్ట్రాల నుంచి రావాల్సిన నిధుల విషయమై కేఆర్ఎంబీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇవాళ బోర్డు ఛైర్మన్ శివనందన్ కుమార్ అధ్యక్షతన భేటీ జరిగింది. ఆంధ్రప్రదేశ్ సభ్యులు వర్చువల్ విధానంలో సమావేశానికి హాజరై, నిధులు ఇచ్చే విషయమై సానుకూలత వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి దశల వారీగా నిధులు అందేలా చూస్తామని చెప్పారు. ఇదే సందర్భంలో బోర్డు బడ్జెట్‌ను కాస్త తగ్గించుకోవాలని, అనవసర వ్యయం లేకుండా చూడాలని ఏపీ సభ్యులు కోరినట్లు సమాచారం.
తెలంగాణ సభ్యుల కోసం వేచి చూసి :తెలంగాణ సభ్యులు సమావేశానికి ప్రత్యక్షంగా హాజరవుతారని బోర్డుకు మొదట సమాచారం ఇచ్చారు. ఈ మేరకు తెలంగాణ ఇంజినీర్లు భేటీకి హాజరయ్యారు. అయితే ఈఎన్సీ అనిల్ కుమార్ వేరే పర్యటనలో ఉండడంతో పాటు వివిధ కారణాల రీత్యా నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా సమావేశానికి హాజరు కాలేదు. తెలంగాణ సభ్యుల కోసం వేచిచూసిన బోర్డు ఛైర్మన్, ఆ తర్వాత సమావేశాన్ని ముగించారు. అయితే తెలంగాణ నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా అనంతరం కేఆర్ఎంబీ (Krishna River Management Board) ఛైర్మన్‌తో ఫోన్లో మాట్లాడి నిధులు ఇచ్చే విషయమై సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. దశల వారీగా నిధులు ఇస్తామని చెప్పినట్లు సమాచారం. అత్యవసర పనులపై హైకోర్టుకు వెళ్లినందున, బోర్డు భేటీకి రాలేకపోయినట్లు ఛైర్మన్‌కు రాహుల్ బొజ్జా వివరించినట్లు తెలిసింది.