Botsa Satyanarayana Big Scam:టీడీపీ ప్రభుత్వంలో ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పిస్తే, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వారిని ఉద్యోగాల నుంచి తీసివేసిన ఘటనపై బాధిత ఉపాధ్యాయులు విద్యా శాఖమంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. వైఎస్సార్సీపీలో విద్యాశాఖ మంత్రిగా చేసిన బొత్స సత్యనారాయణతో పాటుగా సజ్జల రామకృష్ణారెడ్డి తమ నుంచి డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించారు. రూ.12వేల జీతంతో 5 సంవత్సరాలు ఉద్యోగాలు చేశామని, 26వేల జీతం పెరగగానే ఉద్యోగాల నుంచి తీసేశారని ఆరోపించారు. ఇతర పోస్టులకు ఎంపికై, డబ్బులు ఇచ్చిన వారిని రెగ్యలర్ చేశారని బాధిత ఉపాధ్యాయులు ఆరోపించారు.
తెలుగుదేశం ప్రభుత్వం తమకు పీజీటీలుగా ఉద్యోగాలు కల్పిస్తే బొత్స, సజ్జల అకారణంగా తొలగించి లంచం డిమాండ్ చేశారంటూ ఉపాధ్యాయులు ఆరోపించారు. ఈ మేరకు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అక్రమాలపై విద్య శాఖామంత్రి నారా లోకేష్ కు వినతిపత్రం అందించారు. ఎంత ఇస్తారో చెప్పండి అంటూ బొత్స ఓసారి, సజ్జల మరోసారి బహిరంగంగానే డబ్బులు డిమాండ్ చేశారని బాధితులు ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యాశాఖ అధికారి ప్రవీణ్ ప్రకాష్ సైతం తమని అవహేళన చేశారని వాపోయారు. తమ ఉద్యోగాలు తొలగింపు అన్యాయమని న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సైతం లెక్కచేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత డిసెంబర్లో తొలగించిన ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకోవాలని కోర్డు తీర్పు ఇచ్చిందని, అయినప్పటికీ అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు. వీలైనంత త్వరగా సమస్య పరీష్కరించి న్యాయం చేస్తానని బాధితులకు లోకేశ్ హామీ ఇచ్చారు.