Teacher Wrong Behaviour in Nalgonda: తల్లిదండ్రుల స్థానంలో ఉండి విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే, తరగతి గదిలోని బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవరిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని నల్గొండ జిల్లా నిడమనూరు ఆదర్శ పాఠశాలలోని విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదర్శ పాఠశాలలో సాంఘిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు పాఠ్యాంశాల్లో లేని అసభ్యకర విషయాలు చెబుతున్నారని తెలిపారు. ఈ మేరకు విద్యార్థినిలు శనివారం తరగతులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. అమ్మాయిలపై ఎక్కడపడితే అక్కడ చేయి వేయడం, కొట్టడం చేస్తారని మండిపడ్డారు.
ప్రిన్సిపల్‌కు చెప్పినా పట్టించుకోవట్లేదు : 6వ తరగతిలో విద్యార్థులను గత గురువారం దుస్తులు విప్పి పుట్టుమచ్చలు చూపించమని అడిగారని ఆరోపించారు. ఈ విషయాన్ని వెంటనే ప్రిన్సిపల్‌కు వివరించామన్నారు. ప్రిన్సిపల్ తమకు సర్ది చెప్పారన్నారు. మరో ఇద్దరు ఉపాధ్యాయుల ప్రవర్తన కూడా సరిగా లేదని వాపోయారు. ప్రిన్సిపల్‌కు చెప్పినా పట్టించుకోవట్లేదని తెలిపారు. ఈ విషయంపై ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడిని వివరణ కోరగా, తాను ఎలాంటి దురుద్ధేశంతో ఏ పనులూ చేయలేదని, తాకలేదని వివరణ ఇచ్చారు. చదువు, క్రమశిక్షణ పట్ల కఠినంగా ఉండాల్సి రావడంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఉపాధ్యాయులు వివరించారు. తమపై విద్యార్థినిలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని మరో ఇద్దరు ఉపాధ్యాయులు స్పష్టం చేశారు.