TDP Office Grievance: ఉపాధి నిమిత్తం తాను కువైట్‌కు వెళ్లిన సమయంలో వైఎస్సార్సీపీ నాయకులు రెడ్డెయ్య, సుబ్బయ్య, శ్రీనివాసులు తన స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించారని అన్నమయ్య జిల్లా వీరబల్లికి చెందిన కొల్లి నాగయ్య వాపోయారు. ప్రభుత్వం తనకు మంజూరు చేసిన స్థలాన్ని వైఎస్సార్సీపీ వాళ్లు కబ్జా చేయాలని చూస్తున్నారని అన్నమయ్య జిల్లా మదనపల్లెకి చెందిన రామచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదికలో వారు ఫిర్యాదు చేశారు.
వివిధ సమస్యలతో వచ్చిన బాధితుల నుంచి టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు వినతులు స్వీకరించారు. మద్యం కంపెనీ డిస్ట్రిబ్యూషన్ ఇప్పిస్తానని నమ్మించి బాపట్లకు చెందిన కోటేశ్వరరావు 30 లక్షలు తీసుకొని మోసం చేశాడని ఏలూరుకు చెందిన వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. లంచం తీసుకొని, తన పొలానికి వేరొకరి పేరుతో పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చిన వీఆర్వోపై చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన బోయపాటి వెంకటరామయ్య ఫిర్యాదు చేశారు.